స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో మల్లన్న సినిమా చూపిస్తానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మల్కాజిగిరి అసెంబ్లీకి బీఆర్ఎస్ సీటును కూడా తిరస్కరించిన ఆయన మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే నియోజకవర్గం మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి బరిలోకి దిగుతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ భారీ ర్యాలీ నిర్వహించింది.
అనంతరం జరిగిన సభలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. మల్కాజిగిరిలో బీఆర్‌ఎస్ అభ్యర్థి వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కే పరిస్థితి లేదని చెప్పారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో మల్లన్న సినిమా చూపిస్తానని, ఇది ట్రైలర్ మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో గూండాలు, రౌడీలు, కబ్జాకోరులు ఉన్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు వారిని తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు