స్వతంత్ర వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో వైసీపీ(YCP)ని గెలిపించకపోతే పథకాలు ఆగిపోతాయేమో, సంక్షేమం నిలిచిపోతుందేమో అనుకోవద్దని జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. ఇంతకంటే అద్భుతమైన సంక్షేమ పథకాలు(Welfare Schemes) ఉంటాయి తప్ప ఏ పథకమూ ఆగిపోదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలకు జాతీయ నాయకుల పేర్లను పెడతామన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం(Independence Day) సందర్భంగా మంగళగిరిలోని(Mangalagiri) జనసేన కేంద్ర కార్యాలయంలో వీర మహిళలతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… విశాఖ ఉక్కును కాపాడుకుంటామని, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ అవ్వకుండా అడ్డుకుంటామని తెలిపారు. కనీసం గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం తాగడానికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉందని, భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలని సూచించారు. జనసేన పార్టీ అధ్వర్యంలో ప్రజా కోర్టు అనే పేరుతో సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ చేయనున్నట్లు ఈ సందర్భంగా పవన్ వెల్లడించారు.
రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములుకు సరైన గౌరవం దక్కలేదని, స్త్రీ తలచుకుంటే మార్పు ఖచ్చితంగా వస్తుందని, మీరు బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా మార్పు తీసుకొస్తామని వీర మహిళలకు సూచించారు. చట్టసభల్లో మూడో వంతు సీట్లు మహిళలకు ఉండాలి. దేశం కోసం త్యాగం చేసిన మహనీయులను స్మరించుకునేలా ఒక క్యాలెండర్ విడుదల చేయాలి’ అని పవన్ పేర్కొన్నారు.