అధికారం ఉన్నా.. లేకున్నా ప్రజల కోసమే పనిచేశా..! ఇప్పుడూ అదే చేస్తున్నా. సవాళ్లను స్వీకరించి.. ఒక్కో ఇటుకా పేర్చి ముందుకెళ్తున్నాం.. రాత్రికి రాత్రే ఏదీ సాధ్యం కాదు. గత ప్రభుత్వం చేసిన అప్పులూ, తప్పులూ తవ్వేకొద్దీ వస్తున్నాయి. ఇలా.. ఒకటీ రెండూ కాదు కూటమి ప్రభుత్వం 150 రోజుల్లో చేపట్టిన వివిధ అంశాలపై అసెంబ్లీ వేదికగా స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మునుపెన్నడూ చూడని విధంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చారన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 150 రోజుల్లో చేపట్టిన పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఏపీ రాజకీయాల్లో తనకంటూ సుదీర్ఘ ప్రస్తానం ఉందని చెప్పిన ఆయన.. పోరాటాలు కొత్త కాదన్నారు. గత ప్రభుత్వ పాలనలో తనను ఎన్నో అవమానాలుకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో పలుమార్లు కీలక పాత్ర పోషించామని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నా, లేకున్నా రాష్ట్రాభివృద్ధే తన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.
వైసీపీ సర్కారు చేసిన అప్పులు, తప్పులు కూటమి ప్రభుత్వానికి సవాలుగా మారాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 21 మంది ఎంపీలతో ఢిల్లీలో పరపతి పెరిగిందన్నారు. ఒక్కో ఇటుకా పేరుస్తూ ముందుకెళ్తున్నామని చెప్పిన ఆయన.. రాత్రికి రాత్రే ఏదీ సాధ్యం కాదన్నారు. అంకిత భావంతో పనిచేస్తూ ముందుకెళ్తామన్నారు ఏపీ ముఖ్యమంత్రి. సంక్షేమం అనేది టీడీపీ ప్రభుత్వంతోనే మొదలైందన్నారు చంద్రబాబు. రెండు రూపాయలకు కిలోబియ్యం పథకాన్ని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీయేనని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో లబ్దిదారులకు నాలుగు వేల రూపాయల ఫించన్ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రేషన్‌కార్డు, ఆధార్ ఉంటే ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు అందచేస్తున్నట్లు వెల్లడించారు సీఎం చంద్రబాబు.
గత వైసీపీ సర్కారు శాంతి భద్రతలను గాలికొదిలేసిందన్నారు ఏపీ సీఎం. రాజకీయ నాయకులను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేశారన్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు ముఖ్యమంత్రి. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ చేపడతామన్నారు ఏపీ ముఖ్యమంత్రి. పిల్లలకు సైతం ఈ విషయంపై అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. ఎవరైనా భూకబ్జాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.