తిరుపతిలో మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద హైడ్రామా కొనసాగింది. హీరో మోహన్ బాబుకు చెందిన మోహన్‌బాబు యూనివర్సిటీకి ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో పోలీసులు అనుమతి లేదని నోటీసులు ఇచ్చినా మనోజ్ పట్టించుకోలేదు.
యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. గేటు దూకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. మంచు మనోజ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో మోహన్‌బాబు, మనోజ్ బౌన్సర్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
తాను గొడవ చేసేందుకు రాలేదని ఈ సందర్బంగా మంచు మనోజ్ అన్నారు. తాతా, నానమ్మ సమాధులకు నివాళులర్పించేందుకు వచ్చానని చెప్పారు. తన ఫ్లెక్సీలను కావాలనే చించేశారని అన్నారు. తన తండ్రి, సోదరుడు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమమయ్యే సమస్యలను పెద్దది చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హక్కులకు భంగం కలిగిస్తే ఎవరిపైనైనా కేసులు పెడతానని హెచ్చరించారు. అందరి కష్టంతోనే విద్యానికేతన్ వర్సిటీగా ఎదిగిందని.. ఇందులో తనకు భాగం ఉందని ఉద్ధాటించారు. చివరకు ఉద్రిక్త పరిస్థితుల మధ్య యూనివర్సిటీ లోపలికి వెళ్లారు మంచు మనోజ్.
అంతకుముందు మంచు మనోజ్ కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో మోహన్ బాబు వర్సిటీకి భారీ ర్యాలీగా చేరుకోగా.. పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. పోలీసుల సూచనతో ఆయన వెనుదిరిగి నారావారిపల్లె వెళ్లారు. భార్య మౌనికతో కలిసి మంత్రి లోకేశ్‌తో సమావేశమయ్యారు. 20 నిమిషాల భేటీ అనంతరం ఎ.రంగంపేట చేరుకుని పశువుల పండుగను వీక్షించారు. అనంతరం మళ్లీ మోహన్ బాబు యూనివర్సిటీకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఉదయం నుంచే మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మంచు మనోజ్ వస్తాడన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి గొడవలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు మోహరించారు. కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఎవరినీ అనుమతించ లేదు. గేట్లను కూడా మూసివేశారు.
హీరో మోహన్ బాబు కుంటుంబ రచ్చకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. ఫ్యామిలీ వివాదం ఇంకా కొనసాగుతున్నట్టుగానే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.