ఓ మొబైల్ ఛార్జర్ కోసం మొదలైన గొడవ.. చివరకు మహిళ ప్రాణాలు తీసింది. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దుండిగల్ తండాలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్న శాంత తన దుకాణం ప్రక్కన విగతజీవిగా పడిఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శాంతిని ఎవరో హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. సీసీ పుటేజ్ ఆధారంగా రావుల కమల్ కుమార్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు.
దుండిగల్ తండాకు చెందిన శాంతి అదే గ్రామంలో బెల్ట్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన రావుల కమల్ కుమార్ ఆమె ఇంటి పక్కనే ఉంటున్నాడు. ఈ నెల 21న తన మొబైల్ ఛార్జర్ పోయిందంటూ..శాంతితో కమల్ కుమార్ గొడవపడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమెను బలంగా తోయడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆమె మరణించింది. సిసి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు కమల్ కుమార్ ను అరెస్ట్ చేసి విచారించగా నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.