చైనాను మరో కొత్త వైరస్ కలవరపెడుతోంది. కరోనా లాంటి లక్షణాలతో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇన్‌ఫ్లూయెంజా ఏ, HMPV వైరస్‌లతో అక్కడి జనం ఇబ్బందులు పడుతున్నారు. చైనాలో ప్రధాన ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోయాయట. చైనాలో మెడికల్ ఎమెర్జెన్సీ ప్రకటించారంటూ వార్తలు వస్తున్నాయి. చైనా సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తుతున్నాయి. వైరస్ వ్యాపిస్తోందన్న వార్తలను చైనా దాస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ HMPV వైరస్ కరోనాలాగా అంటు వ్యాధి, ప్రాణాంతకమని కూడా చెబుతున్నారు. HMPV సోకిన వారిలో దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉన్నాయి. ఇన్‌ఫ్లూయెంజా ఏ, HMPV, నుమోనియా, కోవిడ్ వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. చైనాలో ఆస్పత్రుల ముందు క్యూ కడుతున్న విజువల్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అసలు ఈ HMPV ఏంటి?
HMPV అంటే హ్యూమన్ మెటా న్యూమోవైరస్. HMPV అనేది శ్వాసకోశ వైరస్, ఇది ఎగువ మరియు దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. CDC ప్రకారం, ఇది చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. ఈ వైరస్ మొదట 2001లో గుర్తించబడింది.
HMPV లక్షణాలేంటి?
HMPV యొక్క లక్షణాలు ఫ్లూ , ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయి. సాధారణ దగ్గు, జ్వరం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో బ్రోన్కైటిస్ , న్యుమోనియా వంటి సమస్యలకు దారితీస్తుంది. HMPV ఇంక్యుబేషన్ పిరియడ్ సాధారణంగా మూడు నుంచి ఆరు రోజుల మధ్య ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ యొక్క తీవ్రతను బట్టి లక్షణాలు వేర్వేరుగా ఉండొచ్చు.
HMPV ఎలా వ్యాపిస్తుంది?
HMPV ఇతర శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే వ్యాపిస్తుంది. ముఖ్యంగా దగ్గినా, తుమ్మినా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. షేక్ హ్యాండ్, లేదా తాకడం వంటివి చేయకపోవడం మంచిది. కలుషితమైన ఉపరితలాలను తాకి.. అదే చేతితో నోరు, ముక్కు లేదా కళ్లను తాకినా వైరస్ వ్యాపిస్తుంది.
HMPV నుండి ఎవరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు?
కొన్నిగ్రూపులకు చెందిన వారికి ఎక్కువ ప్రమాదం కలిగిస్తుంది. చిన్న పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వారికి ఇది ప్రమాదం.
ఎప్పుడు డాక్టర్‌ని కలవాలి?
మీర, మీ పిల్లలు కానీ.. శ్వాసకోశ సంబంధిత లక్షణాలు ఉన్నా.. అలాంటి లక్షణాలు వస్తాయని భావించినా .. కొన్ని రోజుల తర్వాత లక్షణాలు కొనసాగినా లేదా తీవ్రమైనా, జ్వరం మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండి పరిస్థితిలో మార్పు లేకపోయినా డాక్టర్‌ని సంప్రదించాలి.
HMPVని ఎలా నిరోధించాలి?
1..చేతులను 20 సెకన్ల పాటు సబ్బుతో తరచూ కడుక్కోవాలి
2..చేతులు కడుక్కోకుండా ముఖాన్ని అంటుకోవద్దు
3..రోగులకు దూరంగా ఉండాలి
4..బొమ్మలు, టేబుల్స్, డోర్లను అంటుకుంటే తప్పకుండా చేతులు కడుక్కోవాలి
HMPV లక్షణాలు ఉన్నవారు ఏమి చేయాలి?
HMPV లేదా సాధారణ జలుబు లక్షణాలు ఉన్నవారు, సాధారణ పరిశుభ్రత పద్ధతులను అనుసరించడం వలన వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు.
నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి: తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు, డ్రాప్‌లెట్స్ చేరకుండా, వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి టిష్యూ వాడాలి
క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి: కనీసం 20 సెకన్ల పాటు సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోవడం వలన వ్యాప్తిచెందే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం మానుకోండి: ఇతరులకు సోకే అవకాశాలను తగ్గించడానికి పాత్రలు, కప్పులు, ఇతర వ్యక్తిగత వస్తువులను ఒకరివి మరొకరు వాడొద్దు
ఇంట్లోనే ఉండండి: మీకు అనారోగ్యంగా అనిపిస్తే, వైరస్ ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవడం మంచిది.
HMPVకి వ్యాక్సిన్ ఉందా?
ప్రస్తుతానికి, HMPVకి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స, వ్యాక్సిన్ లేదు. వ్యాధి సోకిన వారికి డాక్టర్ దగ్గరకు వెళ్లి చికిత్స తీసుకోవాలి. లక్షణాలను తగ్గించడం, రోగులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి
HMPVకి కొవిడ్ 19కి తేడా ఏంటి?
HMPV మరియు COVID-19కి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. అవి రెండూ దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి శ్వాసకోశ సమస్యలకు కారణమవుతాయి. అలాగే రెండూ శ్వాసకోశ డ్రాప్‌లెట్స్ ద్వారా వ్యాపిస్తాయని వెబ్‌ఎమ్‌డి తెలిపింది.
లక్షణాలు తీవ్రమైతే ఆస్పత్రిలో చేరాల్సి రావొచ్చు. HMPV సాధారణంగా శీతాకాలం, వసంతకాలంలో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది, కోవిడ్-19 వలె కాకుండా, అభివృద్ధి చెందుతున్న వైవిధ్యాల కారణంగా ఏడాది పొడవునా వ్యాప్తి చెందుతుంది.
COVID-19 ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో HMPV కేసులు మూడు రెట్లు పెరిగాయని అధ్యయనాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ల సమయంలో వైరస్‌లకు గురికావడం, వ్యాధి తగ్గడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఎప్పుడైతే మళ్లీ ఆంక్షలు ఎత్తివేసి బయటకు తిరగడం మొదలుపెడతామో.. అప్పుడు శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది.