చైనాలో HMPV కలకలం సృష్టిస్తోన్న వేళ.. భారత్‌లోనూ ఆ వైరస్‌ను గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్కరోజే దేశంలో ఐదు HMPV కేసులు నమోదవగా.. కొత్తగా మరో మూడు కేసులు నమోదయ్యాయి.
అయితే.. ఇదేమీ కొత్త వైరస్ కాదని పాతదేనని.. దీన్ని 2001లో నెదర్లాండ్స్‌లో గుర్తించారని వైద్యనిపుణులు చెబుతున్నారు. వైరస్ వ్యాప్తిరేటు గతంలో 10 శాతంగా మాత్రమే ఉండేదని, ఇప్పుడది 90 శాతానికి చేరుకోవడంతో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయంటున్నారు.
భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని, దానికి సంబంధించిన కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీనిపై ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో పాటు ఐసీఎంఆర్, ఎన్‌సీడీసీ నిశితంగా గమనిస్తున్నాయన్నారు.
మరోవైపు HMPV వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయని తెలిపారు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుందని చెబుతున్నారు.