బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇప్పట్లో ఇబ్బందులు తప్పేలా లేవు. తాజాగా షేక్ హసీనాపై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. హసీనాతో పాటు మరో పన్నెండు మరంది పేర్లను ఈ వారంట్లో చేర్చింది ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్. షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న సమయంలో పలువురు రాజకీయ నాయకులు హత్యకు గురయ్యారన్న ఆరోపణలున్నాయి. అలాగే మరికొంతమంది రాజకీయ నాయకులు అకస్మాత్తుగా అంతర్థానమయ్యారు. ఈ హత్యలు, అంతర్థానాల వెనుక షేక్ హసీనా హస్తం ఉందన్న ఆరోపణలు కొంతకాలంగా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా షేక్ హసీనాతో పాటు మరో పన్నెండు మందిపై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. వీరిని కోర్టు ఎదుట హాజరు పరచడానికి ఫిబ్రవరి 12వ తేదీ వరకు గడువు ఇచ్చారు.
ఐటీసీ విడుదల చేసిన అరెస్ట్ వారంట్‌లో షేక్ హసీనా రక్షణ సలహాదారు మేజర్ జనరల్ రిటైర్డు తారిక్ అహ్మద్ సిద్దిఖి, మాజీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బేనజీర్ అహ్మద్, మాజీ నేషనల్ టెలికమ్యూనికేషన్ మానిటరింగ్ సెంటర్ డైరక్టర్ జనరల్ జియావుల్ అహ్‌సాన్ పేర్లు ఉన్నాయి. కాగా షేక్ హసీనా భారత్‌కు వెళ్లిపోయిన నాటి నుంచి ఆమెపై జారీ చేసిన రెండో అరెస్ట్ వారంట్ ఇది. షేక్ హసీనాపై తొలి అరెస్ట్ వారెంట్ కిందటేడాది అక్టోబరులో జారీ అయింది. ఈ అరెస్ట్ వారంట్ లో షేక్ హసీనాతోపాటు మరో 45 మందిని చేర్చారు. కిందటేడాది నవంబరు 18 న వీరిని తమ ఎదుట హాజరు పరచాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలు అమలు కాలేదు.
కాగా బంగ్లాదేశ్‌లో విద్యార్థి ఉద్యమం ముగిసిన తరువాత నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనుస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. యూనుస్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడగానే, ఉద్యమంలో ఆందోళనకారుల ప్రాణాలు తీసినవారిని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఎదుట హాజరు పరుస్తామని మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాగా విద్యార్థి ఉద్యమం నేపథ్యంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలిపెట్టి భారత్‌కు శరణార్థిగా వెళ్లిపోయారు. దీంతో బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. ఈ హింసాకాండలో దాదాపు 230 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా బంగ్లాదేశ్‌లో తాజాగా హిందువులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఈ దాడుల నేపథ్యంలో భారత్ , బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కాగా షేక్ హసీనాను తమకు అప్పగించాల్సిందిగా కిందటేడాది డిసెంబర్లో భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఒక లేఖ రాసింది. వ్యక్తుల అప్పగింతకు సంబంధించి భారత్ – బంగ్లాదేశ్ మధ్య ఒప్పందం ఉందని ఈ సందర్భంగా యూనస్ నాయకత్వంలో ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. న్యాయప్రక్రియలో భాగంగా షేక్ హసీనాను విచారించాల్సి ఉందన్నారు బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికారులు.
ఇదిలా ఉంటే మహమ్మద్ యూనుస్ నాయకత్వంలో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తరువాత అక్కడ పరిస్థితులు మారిపోయాయి. బంగ్లాదేశ్ లో హిందువులపై అలాగే ఇస్కాన్ ప్రార్థనా మందిరాలపై దాడులు పెరిగాయి. ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ పై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారు. ఇటీవల ఆయనకు బెయిల్ నిరాకరించింది అక్కడి న్యాయవ్యవస్థ.