గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. డి.హిరేహల్ మండల సమీపంలోని కర్ణాటక సరిహద్దులో భారీ వర్షం కారణంగా చిన్న హగిరిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాయదుర్గం, బళ్లారి వెళ్లాల్సిన వాహనదారులు గంటపాటు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. కనేకల్ మండలం మాల్యం గ్రామ సమీపంలో వేదవతి నది జలమయం కావడంతో కనేకల్, మాల్యం గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. బొమ్మనహల్ మండలం ఉద్యహాలు గ్రామ సమీపంలో చిన్న హగిరి ప్రవాహంతో కళ్యాణదుర్గం, బళ్లారి రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


