ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పి అర గ్యారంటీ మాత్రమే అమలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైరయ్యారు. మహిళలు, రైతులు సహా అందరినీ సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు.రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో బీఆర్ఎస్ రైతు దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ” అసెంబ్లీ వేదికగా రుణమాఫీపై రేవంత్‌కు సవాల్ విసిరా. ఒక్క ఊరిలో అయినా వంద శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే నాతో సహా మా ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తారని సవాల్ చేశా. తెలంగాణను ఉద్ధరించానంటూ ఢిల్లీలో రేవంత్ చెబుతున్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసినట్టు రేవంత్ చెప్పుకుంటున్నారు. ఆరు గ్యారెంటీలు హామీ ఇచ్చి.. అర గ్యారెంటీ మాత్రమే అమలు చేస్తున్నారు.
ఈ రాష్ట్రంలో ఉన్న 1.67 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి నెలకు రూ.2,500 చొప్పున రూ.30వేలు బాకీ ఉన్నారు. ఒక్కో రైతుకు ఎకరానికి రూ.17,500 బాకీ పడ్డారు. గతంలో రైతు బంధుకు అడ్డుగా పిటిషన్ వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ మహిళలు, రైతులు నిలదీయాలి’’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.