స్వతంత్ర వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం దేశంలోని గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త అందించింది. రాఖీ పండగ సందర్భంగా భారీ గిఫ్ట్‌ను అందిస్తూ ప్రకటన చేసింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై 200 రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోగా, ఇప్పుడు 900లకే గ్యాస్ సిలిండర్ లభించనుంది. అంతేకాకుండా అదే ఉజ్వల వినియగదారులకు ఏకంగా 400 రూపాయల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ పొందే వారికి మరో 200 రూపాయలు తగ్గింపు ఇచ్చింది. అంటే ఇక నుంచి వీరికి కేవలం 700 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభించనుంది. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
రక్షా బంధన్, ఓనం సందర్భంగా దేశంలోని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద కానుకను అందించిందని చెప్పాలి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై రూ.200 సబ్సిడీని మోదీ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు, ఉజ్వల యోజన ద్వారా 10.35 కోట్ల మంది లబ్ధిదారులు రెట్టింపు లాభం పొందుతారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది. దీంతో ఖజానాపై రూ.7500 కోట్ల భారం పడనుంది.
ఈ ఏడాది మార్చిలో కూడా ఉజ్వల పథకం కింద వంటగ్యాస్ సిలిండర్లపై రూ.200 సబ్సిడీని మోదీ ప్రభుత్వం ప్రకటించింది. అటువంటి పరిస్థితిలో ఈ అదనపు సబ్సిడీని పొందడం వల్ల, ఉజ్వల యోజనలో దాదాపు 10.35 కోట్ల మంది లబ్ధిదారులు దాదాపు సగం ధరకే వంటగ్యాస్ సిలిండర్లను పొందుతారు. అదే సమయంలో ఉజ్వల పథకం కింద 75 లక్షల ఉచిత కనెక్షన్లు ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది.