Saving Schemes |పొదుపు అనేది జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం.. వయసులో ఉన్నప్పుడు ఎంత సంపాదించినా.. ఎంత సేవింగ్ చేశామనేది చాలా ముఖ్యం. పెట్టుబడి పెట్టేందుకు ఎన్నో పొదుపు పథకాలున్నాయి. అయితే అధిక వడ్డీ వచ్చే పథకాల కోసం చూస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా బ్యాంకులు గరిష్టంగా 8శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు పన్ను మినహింపులు కూడా ఉన్నాయి. వచ్చే ఏప్రిల్ నుంచి సీనియర్ సిటిజన్ల సేవింగ్ స్కీమ్స్‌లో డిపాజిట్ పరిమితిని కేంద్రప్రభుత్వం పెంచనుంది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. ఈఏడాది ఏప్రిల్ 1 నుంచి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ డిపాజిట్ పరిమితి రెట్టింపు కానుంది. ఇప్పటివరకు గరిష్టంగా 15 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేయడానికి అవకాశం ఉండగా.. దీని పరిమితిని ఏప్రిల్ నుంచి 30 లక్షల రూపాయలకు పెరగనుంది. సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడితే గరిష్టంగా 30లక్షల రూపాయల వరకు పన్ను మినహయింపు పొందవచ్చు.
వడ్డీ రేట్లు
Saving Schemes | సేవింగ్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టేముందు ప్రతి ఒక్కరూ ఆలోచించేది వడ్డీ రేట్లు. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఇస్తున్నారనేది ముఖ్యం. ప్రస్తుతం చాలా బ్యాంకులు 8శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అలాగే 8శాతానికి పైబడి కూడా వడ్డీరేట్లను అందించే సంస్థలూ ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (scss) కింద గరిష్ట పెట్టుబడిని 15 లక్షల రూపాయల నుంచి 30 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) కోసం పెట్టుబడి పరిమితిని సింగిల్-హోల్డర్ ఖాతా కోసం గతంలో ఉన్న 4లక్షల 50 వేల రూపాయల నుంచి 9 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం పొదుపు పథకాల్లో పెట్టుబడిన వారికి కూడా ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం 15 లక్షల రూపాయలు పెట్టుబడి పొదుపు పథకాల్లో పెట్టినట్లయితే.. మరో 15 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి పన్ను మినహయింపు పొందవచ్చు.