బంగారం అంటే అమ్మాయిలకే కాదు.. దొంగలకూ మోజే. చైన్ స్నాచర్స్, ఇళ్లలో చోరీ చేసేవారు, రైళ్లను దోచేసేవారు, డెకాయిట్లు…ఇలా అందరికీ ఇష్టమైనది బంగారం. అలాంటి బంగారంతో టాయిలెట్ కొమోడీ తయారు చేసి ప్రదర్శనకు పెడితే ఏమవుతుందో.. బ్రిటన్ అధికారులకు అర్ధమైంది.
పై చిత్రంలో కనిపిస్తున్న టాయిలెట్‌ని దొంగల ముఠా 2019లో దోచేసింది. కేవలం ఐదంటే ఐదే నిమిషాల్లో ఈ దొంగల ముఠా దొంగతనం చేసి పరారైంది. ఇది జరిగి ఐదేళ్లవుతున్నా ఆ బంగారం టాయిలెట్ ఏమైందో ఇప్పటికీ తెలియరాలేదు. ఇంగ్లండ్‌లోని బ్లెన్‌హైమ్ ప్యాలెస్‌లో కోట్ల రూపాయల విలువైన గోల్డెన్ టాయిలెట్‌ని 2019లో దొంగలు దోచుకుపోయారు. ప్యాలెస్‌లో ప్రదర్శనకు ఉంచిన 18 క్యారెట్ల గోల్డెన్ టాయిలెట్ ని మాయం చేసేశారు. దీని బరువు సుమారు 98 కేజీలు. అంటే ధర రూ.60 కోట్ల పైమాటే. ఎగ్జిబిషన్ చూడటానికి వెళ్లిన ముఠా దీన్ని ఎత్తుకుపోయింది. భారీ సుత్తులతో పగులగొట్టి మరీ అక్కడి నుంచి ఉడాయించారు. వాడిన సుత్తులను సైతం అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు. 2019 సెప్టెంబర్‌లో ఈ చోరీ జరిగింది. ఈ కేసు ఆక్స్‌ఫర్డ్ క్రౌన్ కోర్టులో ఇటీవలె విచారణకు వచ్చింది.
ఐదుగురు వ్యక్తులతో కూడిన దొంగల ముఠా రెండు వాహనాల్లో వచ్చారు. ప్యాలెస్‌లోని కిటికీ గుండా లోపలికి చొరబడి సుత్తుల సాయంతో టాయిలెట్‌ను పెకిలించుకుపోయారు. ఇదంతా ఐదంటే ఐదు నిమిషాల్లో జరిగిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఉడాయించారు. ఈ కేసులో నలుగురు నిందితులపై విచారణ జరుగుతోంది. నిందితులు దాన్ని అమ్మడానికి చిన్న చిన్న ముక్కలుగా చేసి అమ్మి ఉంటారని ప్రాసిక్యూటర్ జ్యులియన్ క్రిస్టోఫర్ కోర్టుకు తెలిపారు. మైఖెల్ జోన్స్ , ఫ్రెడ్ డో, బోరా గుక్కక్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే తాము నిర్దోషులమని ఆ ముగ్గురు చెప్పగా.. నాలుగో వ్యక్తి జేమ్స్ దొంగతనానికి పాల్పడినట్టుగా అంగీకరించాడు. దీనిపై గత నాలుగు వారాలుగా విచారణ జరుగుతోంది.