నిజమేనండి… రూ.212 కోట్లు నజరానా…కాకపోతే ఒక హంతకుడి ఆచూకీ చెప్పాలి. తన తల్లిదండ్రులను చంపిన వాడి వివరాలు కావాలి… అలా చెప్పిన వాడికి ఈ మొత్తం అందజేస్తానని ఒక కొడుకు ఇచ్చిన ప్రకటన అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇక ప్రైవేటు డిటెక్టివ్ ఏజన్సీస్ కి ఇక పండగే పండగ…ఒక్క కేసు పట్టుకుంటే చాలు…రూ.212 కోట్లు వచ్చి పడతాయి. ఇంతకీ ఇది ఎక్కడా అని అనుకుంటున్నారా? మనదేశంలో మాత్రం కాదండోయ్…
కెనడాలో…
విషయం ఏమిటంటే…కెనడాకు చెందిన అపోటెక్స్ అనే ఫార్మా కంపెనీ అధినేత బార్రీ షెర్మన్, అతడి భార్య హనీ ఇద్దరినీ ఐదేళ్ల క్రితం హత్య చేశారు. స్విమ్మింగ్ ఫూల్ వద్ద రెయిలింగ్ కి బెల్టులతో ఉరివేసి చంపేశారు. ఇన్నేళ్లు గడిచినా హంతకులను పోలీసులు పట్టుకోలేక పోయారు.
అయితే ఆ చంపిన వారు ఫార్మా కంపెనీలో ఉద్యోగులా? లేక బయటవారి పనా? లేదంటే తన తండ్రికి ఎవరైనా శత్రువులు ఉన్నారా?వ్యాపార విభేదాలా? మరి వారి వల్ల ఇతరులకు కూడా ఏమైనా ప్రాణహాని ఉందా? అనే అనుమానాలు పలువురిని వేధిస్తున్నాయి.
ఈ క్రమంలో మరణించిన దంపతుల కుమారుడు జోనాధన్ షెర్మాన్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తన తల్లిదండ్రులను హత్య చేసిన వారి ఆచూకి చెబితే వారికి రూ.212 కోట్లు ఇస్తానని ప్రకటించాడు. ఇది ప్రతినిత్యం తనని వేధిస్తోందని అన్నాడు. మా అమ్మానాన్నలని చంపిన వారికి తగిన శిక్ష పడాలి… అప్పటి వరకు నాకు నిద్ర పట్టదని తెలిపాడు.
ఈ నజరానా ప్రకటన వెలువడగానే ప్రైవేటు డిటెక్టివ్ ఏజన్సీస్, ఔత్సాహిక యువకులు పలువురు హంతకుడి ఆచూకీ తీసేందుకు పరుగులు పెడుతున్నట్టు సమాచారం. ఇంతకీ ఐదేళ్ల క్రితం ఏం జరిగింది? ఎలా జరిగింది? వారికి వ్యాపార పరంగా శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఆ రోజున అటుగా ఎవరు వచ్చారు? సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? లేదా? ఈ కూపీ లాగే పనుల్లో పడినట్టు సమాచారం.
పనిలో పనిగా మొత్తం కెనడాలోని పోలీసు వ్యవస్థలో అందరూ కూడా నిందితుడిని పట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మొత్తానికి రూ.212 కోట్లు అంటే మాటలు కాదు కదా…ఇంతమంది ఇన్వెస్టిగేషన్ చేస్తే దొంగ దొరక్కపోతాడా? అని మరికొందరు వ్యాక్యానిస్తున్నారు.