Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హతపై తాజాగా మరో దేశం స్పందించింది. ఇప్పటికే అమెరికా తన అభిప్రాయాన్ని వెల్లడించగా.. ఇక జర్మనీ కూడా రాహుల్ వ్యవహారంపై స్పందించింది. దేశ వ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ రాహుల్ అనర్హత అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అనేక దేశాలు సైతం ఈ విషయంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి. రాహుల్ గాంధీ విషయంలో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయని, తీర్పుపై ఆయన అప్పీల్ చేసుకోవచ్చని జర్మనీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. భారత్ లో రాహుల్ గాంధీకి జైలు శిక్ష పడటం, ఆ తీర్పు కారణంగా ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దవ్వడం వంటి అంశాలను తాము గమనిస్తున్నామని తెలిపింది. ఈ తీర్పుపై రాహుల్ గాంధీ అప్పీల్ చేసుకునే స్థితిలోనే ఉన్నారని, అప్పుడే ఈ తీర్పు నిలబడుతుందా.. ఏ ప్రాతిపదికన ఆయనపై అనర్హత పడింది అనేది స్పష్టమవుతుందని పేర్కొంది. ఈ కేసుకు న్యాయ స్వతంత్రత ప్రమాణాలు, ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయని జర్మనీ అభిప్రాయపడుతోందంటూ ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.
అమెరికా కూడా రాహుల్ గాంధీ అనర్హత వ్యవహారంపై స్పందించింది. ఏ ప్రజాస్వామ్యానికైనా.. చట్ట నిబంధనలను గౌరవించడం, న్యాయ స్వతంత్రత మూల స్తంభాల్లాంటివని అమెరికా అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే అంశంలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నామని ఇప్పటికే అగ్రరాజ్యం వెల్లడించింది.
Read Also: పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు.. ఒక్కరోజులోనే అమాంతం పెరిగిన కొత్త కేసులు..
Follow us on: Youtube, Instagram, Google News