పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో గేటు రాజకీయం రంజుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య పంచల్ పేలుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇస్తుండటంతో నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. ఇంతకీ ఆ గేటు రాజకీయం ఏంటి..? రేవంత్ చేసిన వ్యాఖ్యలేంటి..? అందుకు ధీటుగా నేతలిస్తున్న కౌంటర్ ఏంటి..?
ఏపీలో కుర్చీ రాజకీయం మరువకముందే.. తెలంగాణలో గేట్ల పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచే ఆ సర్కార్ కూలిపోవడం ఖాయమని.. ఐదేళ్లు పాలన సాగదన్న విమర్శలు చేశారు గులాబీ, కమలనాథులు. దీంతో ఆ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఖమ్మం జిల్లా మణగూరు ప్రజా దీవెన వేదికగా తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. విపక్షాలైన బీజేపీ, బీఆర్‌ఎస్‌లు తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర చేస్తున్నాయని.. ఒకవేళ తాము గెట్లు తెరిస్తే కేసీఆర్ కుటుంబం తప్ప బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నారని సెటైర్లు వేశారు. ఆ తర్వాత బీజేపీ లక్మణ్‌ను టార్గెట్ చేస్తూ కూడా ఫైర్ అయ్యారు రేవంత్. కమలం పార్టీకి ఉన్నదే 8 మంది ఎమ్మెల్యేలని ఎద్దేవా చేశారు. ఇదంతా జరిగి నాలుగు రోజులు కాకముందే… మీట్ ది మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి గేట్లు ఓపెన్ చేశామని.. అయితే, ప్రస్తుతానికి ఒక్కటే గేటు ఓపెన్ చేశామని.. అవతల ఖాళీ అయ్యాక మురిసినా తెరిచినా ఒక్కటేనంటూ సెటారికల్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్‌కుమార్ చేరిక సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్.
రేవంత్ చేసిన గేట్ల వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ సీనియర్ లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. తాము పడగొట్టడానికి సిద్ధంగా లేమన్న ఆయన.. గేట్లు తెరిచారు కాబట్టి మీ ఎమ్మెల్యేలు పారిపోకుండా కాపాడుకోండి.. జాగ్రత్త పడండి అంటూ సెటైర్లు వేశారు. దేశంలో మోదీ సర్కార్ రావడం ఖాయమని, కాంగ్రెస్ ఓడిపోతుందని జోష్యం చెప్పారు.
ఇక బీఎస్పీకి గుడ్‌బై చెప్పి.. బీఆర్‌ఎస్ గూటికి చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా రేవంత్ వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానమిచ్చారు. ఓవైపు సుతిమెత్తగా నన్ను పొగుడుతూనే.. మరోవైపు సుతిమెత్తగా వార్నింగ్ ఇస్తున్నారన్న ఆయన.. చాలా మంది పిరికిపందలు, స్వార్థపరులు, గొర్రెల మందల్లా కాంగ్రెస్‌లోకి పోతున్నారని.. నిజమైన, నికార్సైన నాయకుడిగా ఆ గొర్రెల మందలో ఒకడిలా ఉండాలని భావించలేదన్నారు ప్రవీణ్‌కుమార్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవిని రేవంత్ సర్కార్ ఆఫర్ చేసిన మాట వాస్తవమేనని కానీ తాను తిరస్కరించినట్టు తెలిపారు. తనకు ప్రభుత్వ పదవులు అవసరం లేదని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను ప్రజాక్షేత్రంలో ఉండదలుచుకున్నానని.. ఎటు వైపు వెళ్లాలనే స్వేచ్ఛ తెలంగాణ ప్రజలకు లేదా? హెచ్చరిస్తున్నారా? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటుకు పట్టు బడుతోంది బీఆర్‌ఎస్. ఈ వ్యవహారంతో హస్తం, గులాబీ నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. పార్టీ ఫిరాయింపుతో అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు వినతి పత్రం అందజేసింది గులాబీ నేతల బృందం. వెంటనే దానంపై అనర్హత వేటు వేయాలని వారు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గతంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టి చంపాలన్న రేవంత్ ఇప్పుడేం చేస్తారని నిలదీశారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి.
ఇటు బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్‌కు అంతే ధీటుగా కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. దయ్యాలే వేదాలు వల్లించినట్టుగా ఉందని మండిపడ్డారు. గతంలో పదేళ్లపాటు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా అని నిలదీశారు. మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు ఆ పార్టీ నేత రామ్ మోహన్‌రెడ్డి. రేవంత్ చెబుతున్నట్టు బీఆర్‌ఎస్ ఖాళీ అయిందా..? మరిన్ని వలసలు పెరగనున్నాయా..?ఎమ్మెల్యే దానంకు అనర్హత వేటు తప్పదా అన్నది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.