సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఓ వైపు లోక్‌సభ అభ్యర్థులపై కసరత్తు చేస్తూ.. మరోవైపు మేనిఫోస్టో సిద్ధం చేస్తోంది. ఇందుకోసం నిన్న ఏఐసీసీ కార్యాలయంలో సుదీర్ఘంగా చర్చించి మేనిఫెస్టోకి తుది రూపు ఇచ్చింది. భాగీదారి న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ దేశ ప్రజలకు న్యాయం దక్కేలా చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. యువత, మహిళలు, కార్మికులు, కర్షకులు, అణగారిన వర్గాల కోసం రూపొందించిన ఈ ఐదు ‘న్యాయ్’ హామీలను దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి చెంతకు చేర్చాలని పార్టీ పిలుపునిచ్చింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో హామీలను ఇచ్చి, అమలు చేసిన మాదిరే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తన హామీలను అమలు చేస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని నిర్ణయించింది.
పి.చిదంబరం నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన మేనిఫెస్టోకు ఆమోదం తెలిపిన సీడబ్ల్యూసీ, త్వరలో పూర్తి మేనిఫెస్టోను అధికారికంగా ప్రజల ముందుంచే బాధ్యతను పార్టీ చీఫ్ ఖర్గేకు కట్టబెట్టింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోపై చర్చించి, ఆమోదించేందుకు సీడబ్ల్యూసీ ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయింది. ఈ సమావేశానికి పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాందీ, రాహుల్ గాంధీతో పాటు అంబికా సోనీ, ప్రియాంక గాందీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.