వైసీపీకి త్వరలోనే మరో భారీ ఎదురు దెబ్బ తగలనుందా? ఆ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న ఎమ్మెల్సీ జంప్ చేసేందుకు లైన్ క్లియర్ అయిందా? సదరు నేత జనసేనలోకి వెళ్లిపోతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. వైసీపీలో వివాదాస్పద నేత.. మండపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన తోట త్రిమూర్తులు కొత్త పార్టీలో చేరబోతున్నారట. ప్రస్తుతం వైసీపీ నాయకుడిగా ఉన్న ఆయన గతంలో పార్టీల్లో పని చేసిన అనుభవం ఉంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన త్రిమూర్తులు.. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే వైసీపీ అధికారంలో లేకపోవడంతో ఇప్పుడు జనసేనలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది.
తోట త్రిమూర్తులు టీడీపీ నుంచి తన రాజకీయాన్ని ప్రారంభించారు. అయితే 1994లో టికెట్ దక్కకపోవడంతో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలి సారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 1999లో టీడీపీ టికెట్‌పై విజయం సాధించారు. 2004లో టీడీపీ తరపునే పోటీ చేసినా.. కాంగ్రెస్ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరిన త్రిమూర్తులు.. 2009లో పీఆర్పీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ మరణానంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీలో జాయిన్ కావడం.. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో.. 2012లో రామచంద్రాపురంకు ఉపఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద త్రిమూర్తులు పొటీ చేసి విజయం సాధించారు.
రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ టీడీపీలో జాయిన్ అయిన త్రిమూర్తులు 2014 ఎన్నికల్లో మరో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో మరోసారి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలోనే 2021లో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన తోటకు బలమైన కేడర్ ఉంది అదే సమయంలో ఆయన ఫైర్ బ్రాండ్ నాయకుడిగా కూడా చలామణి అయ్యారు. ఈ క్రమంలో టీడీపీని దెబ్బకొట్టేందుకు జగన్ వేసిన వ్యూహంలో భాగంగా తోటకు.. ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేశారు. తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ ఇవ్వొద్దని గోదావరి జిల్లాలకు చెందిన దళిత నాయకులు ఎంత వారించినా.. చివరకు జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి కేటాయించారు.
ఎమ్మెల్సీగా ఉంటూనే గత అసెంబ్లీ ఎన్నికల్లో మండపేట నుంచి వైసీపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన దగ్గర నుంచి త్రిమూర్తులు పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నా.. మండలి సమావేశాలకు కూడా గైర్హాజరవుతున్నారు. ఈ క్రమంలో తోట మరోసారి పార్టీ మారతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు తెరవెనుక కసరత్తు కూడా జరిగిందని.. త్వరలోనే ప్రకటన వెలువడుతుందనే టాక్ వినిపిస్తుంది.
తోట త్రిమూర్తులు వియ్యంకుడు సామినేని ఉదయభాను ప్రస్తుతం జనసేనలోనే ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న ఉదయభాను.. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. గతంలో వైఎస్ ఫ్యామిలీకి, వైఎస్ జగన్‌కు అత్యంత ఆప్తుడిగా పేరున్న ఉదయభాను.. పార్టీ ఓటమి తర్వాత జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు తన వియ్యంకుడు త్రిమూర్తులును కూడా జనసేనలో చేర్పించేందుకు ఉదయభాను ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
ఉదయభాను జనసేనలో చేరిన దగ్గర నుంచి త్రిమూర్తులును పార్టీలోకి రావాలని ఒత్తిడి తెస్తున్నారట. కానీ తోట త్రిమూర్తులుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదై ఉంది.ఈ కేసులో త్రిమూర్తులును కోర్టు దోషిగా కూడా తేల్చింది. ప్రస్తుతం హైకోర్టులో తీర్పును సవాలు చేయడంతో బయట ఉన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థిస్తే.. త్రిమూర్తులు జైలుకు పోక తప్పదు. అందుకే ఇప్పుడు పార్టీ మారడం అవసరమా అని త్రిమూర్తులు డైలమాలో ఉన్నారట. అయితే ఉదయభానుతో పాటు మండపేట జనసేన నాయకులు కూడా ఒత్తిడి తేవడంతో త్రిమూర్తులు అంగీకరించినట్ల తెలిసింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


