స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజా గాయకుడు గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు కీలక ప్రకటన చేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు మెదక్ జిల్లా తూప్రాన్ పోలీసులను కలిసి రక్షణ కల్పించాలని కోరారు.
అంబేద్కర్ స్పూర్తితో కేసీఆర్ రాచరిక పాలనకు వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు గద్దర్ పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ దళితులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. అయితే గద్దర్ ఏ పార్టీ నుంచి పోటీ చేయనున్నారనేది మాత్రం పేర్కొనలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్ పై పోటీకి సిద్ధమని ప్రకటించినా టికెట్ రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు. మళ్లీ ఇప్పుడు అదే ప్రకటన చేయడంతో ఏ పార్టీ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందోనన్న చర్చ జరుగుతోంది.