- ఇచ్ఛాపురం… ఇడుపులపాయ మధ్య సాగిన పాదయాత్ర
ముఖ్యమంత్రి పీఠం మీదకు వైఎస్ జగన్‌ను తీసుకొచ్చిన అంశాలలో పాదయాత్ర చాలా ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలన్నింటినీ కలుపుతూ పాదయాత్ర నిర్వహించారు. దీనిద్వారా సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొంటూ ముందుకు కదిలారు వైఎస్ జగన్. ఈ పాదయాత్ర ఇచ్చిన విజయంతో వైఎస్ జగన్ మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. అటు నుంచి అటే ఎన్నికల గోదాంలోకి దూకారు. విజయ బావుటా ఎగరవేశారు.
వైఎస్సార్ కడపజిల్లా ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్ 6న జగన్ తన పాదయాత్రకు తొలి అడుగువేశారు. ప్రజలవద్దకు వెళ్లి స్వయంగా వారి కష్టాలు తెలుసుకుని కన్నీళ్లను తుడిచారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చి హామీలను మేనిఫెస్టోలో చేర్చారు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పొందుపరచిన 98శాతం హామీలను మూడున్నరేళ్లలోనే నెరవేర్చారు. కోట్లాది హృదయాలను స్పృశించిన ప్రజాసంకల్ప పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది.
మొత్తంగా పాదయాత్ర రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాల గుండా సాగింది. 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజుల పాటు- 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైయస్ జగన్ ప్రసంగించారు. పాదయాత్ర ఆద్యంతం విభిన్నవర్గాల ప్రజానీకం ఆయనతో కలిసి నడిచారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు, భరోసాలే‘వైయస్ జగన్ అనే నేను.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాను..’అని చెప్పే వరకు నడిపించాయి. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, మహిళా సాధికారత, విద్యా దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, నాడు–నేడు కార్యక్రమాల ద్వారా ఇంకా నడిపిస్తూనే ఉన్నాయి.
మొత్తం మీద పాదయాత్రల్లో ఇచ్చిన హామీల ఆధారంగా వైఎస్ జగన్ మ్యానిఫెస్టోని రూపొందించటం, ఆ మ్యానిఫెస్టోలోని హామీలను అమలు చేయటం జరుగుతున్నాయి. ఈ హామీల అమలునే విజయదీపికగా చూపించి వైఎస్ జగన్ మరోసారి ఎన్నికలకు సిద్ధపడుతున్నారు.