34.3 C
Hyderabad
Sunday, April 20, 2025
spot_img

తెలంగాణలో బీజేపీ మధ్యప్రదేశ్‌ మంత్రం

– తెలంగాణలో బూత్‌ కమిటీలపై బీజేపీ దృష్టి
-30 శాతం కమిటీలు మాత్రమే అసలైనవని నాయకత్వం అనుమానం
– ఒక్కో నియోజకవర్గానికి 5 వేల మంది బూత్‌ కమిటీ సభ్యులు
– ప్రతి బూత్‌ కమిటీకి 22 మంది సభ్యులు
– ప్రతి 30 మంది ఓటర్లకు ఐదుగురు ఇన్చార్జిలు
– ప్రతి బూత్‌ కమిటీకి ఓ సోషల్‌మీడియా ఇన్చార్జి
– వీరంతా నిరంతరం జనం మధ్యలో ఉండేలా కార్యాచరణ
– నిఘాకు పక్క నియోజకవర్గాల నుంచి పరిశీలకులు
– సంఘ్‌ నుంచి నియోజకవర్గానికి ముగ్గురు పరిశీలకులు
– పాలక్‌, విస్తారక్‌, పార్లమెంటు ఇన్చార్జిల నియామకం
– ఢిల్లీ నుంచి నేరుగా నాయకత్వ పర్యవేక్షణ
– తెలంగాణలో బీజేపీ జనజాగరణ

( మార్తి సుబ్రహ్మణ్యం)

మధ్యప్రదేశ్‌ ఫార్ములాతో తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బూత్‌ కమిటీలను పటిష్టం చేసి అధికారంలోకి వచ్చిన మధ్యప్రదేశ్‌- గుజరాత్‌- రాజస్థాన్‌ రాష్ర్టాల ఫార్ములాను, తెలంగాణలో కూడా అమలు చేసేందుకు బీజేపీ నాయకత్వం ప్రణాళిక అమలు చేస్తోంది. అందులో భాగంగా, తెలంగాణలోని అన్ని బూత్‌ కమిటీలను పటిష్టం చేసే లక్ష్యంతో అడుగులేస్తోంది.

ఆమేరకు గత వారం నుంచి.. తెలంగాణలోని అన్ని స్థాయుల నాయకులంతా, బూత్‌ కమిటీపై సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు. మిగిలిన పనులు పక్కనపెట్టి, కేవలం బూత్‌ కమిటీలను భర్తీ చేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీన్నిబట్టి మధ్యప్రదేశ్‌ ఫార్ములాపై బీజేపీ ఎంత సీరియస్‌గా ఉందో స్పష్టమవుతోంది.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో.. ఎలాగైనా అధికారంలోకి రావాలని పరితపిస్తున్న బీజేపీ, ఆ మేరకు తన కార్యాచరణను వేగవంతం చేస్తోంది. అందుకోసం పోలింగ్‌ బూత్‌ కమిటీలను పటిష్టం చేయనుంది.

మధ్యప్రదేశ్‌లో సక్సెస్‌ అయిన పోలింగ్‌ బూత్‌ కమిటీల ఫార్ములాను, తెలంగాణలో కూడా అమలుచేయాలన్నదే నాయకత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. గుజరాత్‌, రాజస్థాన్‌లో కూడా ఇదే ఫార్ములాను అమలుచేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నిజానికి తెలంగాణలో ప్రస్తుతం ఉన్న బూత్‌ కమిటీలలో, 30 శాతం మాత్రమే సరైనవని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. మిగిలినవన్నీ కంటితుడుపుగా, కొందరి పేర్లతో నింపేశారని భావిస్తోంది. హైదరాబాద్‌ నగరంలో కూడా ఇప్పటిదాకా అన్ని నియోజకవర్గాల్లో అసలైన పోలింగ్‌ బూత్‌కమిటీలు లేవని, కేవలం 10-12 మందితో మాత్రమే పనిచేయిస్తున్నారని నాయకత్వం గ్రహించిందట.

పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలతోపాటు.. కొద్దిగా ఉనికి ఉన్న మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా, పోలింగ్‌ బూత్‌ కమిటీలు అంతంతమాత్రంగానే పనిచేస్తున్నాయన్న ఫిర్యాదు, కేంద్ర పార్టీ నాయకత్వానికి అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాత పద్ధతికి తెరదింపి.. బూత్‌ స్థాయిలో అసలైన కార్యకర్తలను నియమించాలని, నాయకత్వం నిర్ణయించింది. ఆ మేరకు బూత్‌కమిటీలపై సీరియస్‌గా దృష్టి సారించింది.

ఆ ప్రకారంగా… ఒక్కో పోలింగ్‌బూత్‌లో సగటున 800 ఓట్ల వరకూ ఉంటారు. అందులో ఒక ఓటరులిస్టు పేజీలో ఉండే 30 మంది ఓటర్లకు, ఐదుగురిని ఇన్చార్జిలుగా నియమించనున్నారు. వారిని పన్నా ప్రముఖ్‌, పన్నా కమిటీగా పిలుస్తారు. అదేవిధంగా ప్రతి పోలింగ్‌బూత్‌కు 22 మంది సభ్యులను నియమించనున్నారు. వీరిలో ఒకరు సోషల్‌మీడియా ఇన్చార్జిగా వ్యవ హరిస్తారు. సోషల్‌మీడియా ప్రాధాన్యం గుర్తించిన పార్టీ నాయకత్వం.. దానిని పోలింగ్‌ బూత్‌ స్థాయికి విస్తరించి, సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది.

పార్టీ కార్యక్రమాలను బూత్‌ స్థాయి ఓటర్లకు చేర్చాలన్నది అసలు లక్ష్యం. అలా నియోజకవర్గానికి సగటున 5 వేల మందిని.. బూత్‌ కమిటీ సభ్యులుగా నియమించాలన్నది, బీజేపీ నాయకత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఒక్కో అసెంబ్లీకి సగటున 250 పోలింగ్‌ బూత్‌ కమిటీలు ఉంటాయని పార్టీ వ ర్గాలు వెల్లడించాయి.

ఈ కమిటీల నియామకం పూర్తయిన తర్వాత.. పక్క నియోజకవర్గాల నుంచి శిక్షణ పొందిన కార్యకర్తలు, మరో నియోజకవర్గానికి బూత్‌ కమిటీ పరిశీలకులుగా వెళ్లనున్నారు. అంటే ఆ కమిటీలన్నీ అసలైనవా? లేక కంటితుడుపుగా పనిచేశారా? అని నిఘా వేయనున్నారన్న మాట. వీరుకాకుండా.. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో పాలక్‌, విస్తారక్‌, పార్లమెంటు ఇన్చార్జి కూడా బూత్‌ కమిటీలను పర్యవేక్షించనున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధి పార్లమెంటు ఇన్చార్జిగా వ్యవహరిస్తారు.

ఈ బూత్‌కమిటీ సభ్యులంతా నిరంతరం తమకు కేటాయించిన ఓటర్ల సమస్యలు తెలుసుకుంటారు. బీజేపీ సిద్ధాంతాలకు సంబంధించిన కరపత్రాలు, ఓటర్లకు పంపిణీ చేస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఈ సభ్యులంతా, తమకు కేటాయించిన ఓటర్లతో మమేకం అవుతారన్నమాట.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఇదే ఫార్ములాను అనుసరించడం వల్లే.. పార్టీ అధికారంలోకి రాగలుగుతోందని, బీజేపీ నాయకుడొకరు వివరించారు. అన్ని కమిటీలకు 22 మందిని భర్తీ చేయడం.. ఉత్తరప్రదేశ్‌- గుజరాత్‌ వంటి రాష్ర్టాల్లో కూడా కష్టమైనప్పటికీ, ఉన్న వాస్తవ పరిస్థితుల మేరకు బలపడాలన్నది పార్టీ విధానమని మరో సీనియర్‌ నేత చెప్పారు. మైనారిటీలు ఉన్న ప్రాంతాల్లో పార్టీకి బూత్‌ కమిటీ సభ్యులు దొరకడం కష్టమంటున్నారు. అక్కడ హిందువులయిన పార్టీ సానుభూతిపరులతో, బూత్‌ కమిటీలు భర్తీ చేస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ఫార్ములాను కఠినంగా అమలుచేస్తే.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం, పెద్దం కష్టం కాదన్నది పార్టీ నాయకత్వ అంచనా.

Latest Articles

దర్శకుల సమక్షంలో ‘ఏఎల్‌సీసీ’ బిగ్ టికెట్ లాంచ్

యెల్ ఆర్ ఫిల్మ్ సర్కూట్స్ బ్యానర్‌పై లేలీధర్ రావు కోలా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏ ఎల్ సి సి’ (ఓ యూనివర్సల్ బ్యాచిలర్). రీసెంట్ గా ఈ సినిమా ట్రెయిలర్ విడుదలై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్