ఫార్ములా – ఈ రేస్ కేసులో ఏసీబీ మలివిడత విచారణకు రెడీ అయ్యింది. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని విచారించిన విషయం తెలిసిందే. రేస్ నిర్వహణలో తొలి ప్రమోటర్‌గా ఉన్న ఏస్ నెక్ట్స్ జెన్ వ్యవహారం పైనా దృష్టి సారించింది. ఈనెల 18న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది.
2022 అక్టోబరు 25న జరిగిన తొలి ఒప్పందం ప్రకారం.. సీజన్ 9, 10, 11, 12 రేస్‌ల నిర్వహణ ఖర్చులను ఏస్ నెక్స్ట్‌జెన్ భరించాలి. హైదరాబాద్‌లో 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో సీజన్ – 9 రేస్ జరిగింది. అనంతరం 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్- 10 రేస్ కోసం ఫార్ములా – ఈ ఆపరేషన్స్ సంస్థకు 2023 మేలోనే 50% సొమ్ము అనగా 90 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయినప్పటికీ.. ఏస్ నెక్ట్స్‌జెన్ ముందుకు రాలేదు.
సీజన్ – 9తో తమకు నష్టం వాటిల్లిందంటూ చేతులెత్తేసింది. దాంతో ప్రమోటర్ పాత్రను హెచ్‌ఎండీఏనే పోషించాలని అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో 2023 అక్టోబరు 5, 11 తేదీల్లో రూ.45.71 కోట్లను ఎఫ్‌ఈవోకు హెచ్‌ఎండీఏ బదిలీ చేసింది. ఈ వ్యవహారమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. తన బాధ్యత నుంచి తప్పుకొన్న ఏస్ నెక్ట్స్ జెన్ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పైనా ఏసీబీ ఆరా తీస్తోంది.