Skin Care Tips |వేసవి కాలం మొదలవుతోంది. ఈ వేడిమికి చాలామంది చర్మ సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా చర్మం జిడ్డుపడటం, నల్లబడటం జరుగుతుంది. సూర్యకాంతి వలన చర్మం నల్లబడటం, ట్యానింగ్, జిడ్డుగా మారటం మొదలైన సమస్యలు చాలామందిలో సర్వసాధారణం. తీవ్రమైన ఎండ దెబ్బకు డీహైడ్రేషన్ కలిగి చర్మం మరింత నిర్జీవంగా మారుతుంది. చర్మంపై దురద, చికాకు, మంట వంటివి కలిగి మొటిమలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. సున్నితమైన చర్మాన్ని కలిగి ఉండే వారు ఎండవేడికి త్వరగా ప్రభావితం అవుతారు. సరైన చర్మ సంరక్షణ విధానాలు అవలబించడం ద్వారా ఎండాకాలంలోనూ చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ వేసవిలో చర్మ సమస్యల నుంచి బయటపడేందుకు కొన్ని సహజ మార్గాలు ఉన్నాయి, ఇవి సన్ ట్యాన్‌ను తొలగించి చర్మాన్ని లేత రంగులోకి మారుస్తాయి. ఎండలో తిరిగి వచ్చినపుడు చర్మం నల్లబడకుండా తక్షణ ఉపశమనంగా మీ ముఖాన్ని చల్లటి నీటితో కడక్కోవాలి. తర్వాత మెత్తని టవల్‌తో తుడవండి. ఆ తర్వాత దానిపై అలోవెరా జెల్‌ను అప్లై చేయాలి. అలోవెరా, దోసకాయ నీళ్లను కూడా ముఖానికి రాసుకోవచ్చు. అలోవెరా జెల్‌ను సేకరించి, ఫ్రిజ్ లోని ఐస్ ట్రేలో ఉంచి ఎప్పుడైనా వాడుకోవచ్చు.
సన్ బర్న్, ట్యానింగ్ బారిన పడకుండా చర్మాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
Skin Care Tips |చర్మాన్ని శుభ్రపరచండి: వేసవి చర్మ సంరక్షణకు శుభ్రత ముఖ్యం. ఆల్కహాల్ లేని ఫేస్‌వాష్‌ను ఉపయోగించి, రోజుకు రెండు నుంచి మూడు సార్లు ముఖం కడుక్కోవాలి. రెండు సార్లు స్నానం చేయాలి.
చర్మాన్ని మృదువుగా ఎక్స్‌ఫోలియేట్ చేయండి: పొడి చర్మం, మృత చర్మ కణాలను తొలగించడానికి వారానికి రెండుసార్లు సున్నితమైన స్క్రబ్‌ను ఉపయోగించి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయాలి.
తేలికపాటి మాయిశ్చరైజర్ వాడండి: పలుచటి మాయిశ్చరైజర్‌ను చర్మంపై అప్లై చేయాలి. ఇది చర్మాన్ని సూర్యుడి నుండి కాపాడుతుంది.
ఎక్కువుగా నీరు తాగాలి: వేసవి చర్మ సంరక్షణలో నీరు తాగడం చాలా అవసరం. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
ఎండలో రక్షణ: ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ ధరించడం, గొడుగు లేదా టోపీని ధరించడం మర్చిపోవద్దు. వీలైనంత వరకు చర్మాన్ని కప్పి ఉంచే తేలికైన కాటన్ దుస్తులను ధరించడం మంచిది.