Pavan Kalyan | తెలంగాణలో క్షేత్ర స్థాయి సమస్యల మీద దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేసి జనసేన పార్టీ ఉనికిని చాటాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచించారని జనసేన అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. సమస్య తీవ్రత ఆధారంగా ఏ స్థాయిలో స్పందించాలి.. ఏ స్థాయిలో పోరాటం చేయాలి అనేది క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని తెలిపారు. ప్రతి సమస్యను జనసేన పార్టీ తరఫున రాష్ట్రసర్కారు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేయాలన్నారు. మంగళవారం హైదరాబాద్ లో పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో 12 నియోజకవర్గాలకు చెందిన పార్టీ కో ఆర్డినేటర్లతో పవన్ సమావేశం అయ్యారు. సంబంధిత నియోజక వర్గాల రాజకీయ, సామాజిక పరిస్థితులపై నివేదికను పవన్ కళ్యాణ్ కి వారు అందచేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశాల మీద కో ఆర్డినేటర్లకి పవన్ దిశానిర్దేశం చేశారు. ప్రతి అంశంలో కూడా వీర మహిళలను, జన సైనికులను కలుపుకొని వెళ్లానని సూచించారు.