Heavy Rains | తెలంగాణాలో ఓ వైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు అకాల వర్షాలు అన్నదాతల ఆశలను ఆవిరి చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో గురువారం భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం రైతులను నిలువునా ముంచేసింది. రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో పంటంతా నేలపాలైంది. ఈదురు గాలులకు మామిడి పండ్లు రాలిపోయి నేలమట్టమయ్యాయి. పండ్లు చేతికందే సమయంలో నేలరాలడంతో మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు వర్షం కారణంగా ఆరబోసిన ధాన్యం కుప్పలు మొత్తం తడిసిపోయాయి. చేతికచ్చిన పంట అమ్ముదామనుకుంటే.. ధాన్యం తడిసిపోయిందని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు రైతులు. ప్రభుత్వం ఎలాగైనా తమకు సాయం చేయాలని బాధిత రైతులు కోరుకుంటున్నారు.