స్వతంత్ర వెబ్ డెస్క్: టెక్నాలజీ రోజు రోజుకు ఎంత పెరగిపోతున్నా.. ఇంకా కొందరు మూఢనమ్మకాలపైనే ఆధారపడుతున్నారు. అయితే.. ఇలాంటి వారిని ఆసరా చేసుకొని కొందరు దొంగ బాబాలు వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఫేక్ బాబాల(Fake Baba) నిర్వాకం వెలుగులోకి వచ్చినవే. అయితే.. ఇప్పుడు హైదరాబాద్ పాతబస్తీలో ఓ ఫేక్ బాబా గుట్టు రట్టైంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఎల్బీ నగర్‌లో మహిళపై పోలీసుల దాడి, నిన్న నానక్‌రామ్ గూడలో మహిళపై అత్యాచారం చేసి హత్య వంటి ఘటనలు విచారణ జరుగుతూనే ఉంది.
తాజాగా నగరంలో మరో దారుణం వెలుగుచూసింది. హైదరాబాద్‌లోని (Hyderabad) పాతబస్తీ బండ్లగూడలో (Bandlaguda) ఓ నకిలీ బాబా దారుణానికి ఒడిగట్టాడు. ఓ నవవధువుకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమె అత్తమామలు బాబా దగ్గరికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నవ వధువుపై కన్నేసిన నకిలీ బాబా ఆమె అత్యాచారానికి పాల్పడ్డాడు. పక్క గదిలోకి తీసుకెళ్లి తన కళ్లకు గంతలు కట్టి బాబా తనపై అత్యాచారం చేశాడని యువతి ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నకిలీ బాబా పరారీలో ఉన్నట్లు సమాచారం. బాబా కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.