బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రధానంగా మహిళలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ హాయంలో మహిళలను పట్టించుకోవడం లేదని.. కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు వడ్డీలేని రుణాలు ఇచ్చిందని చెప్పారు.
కవిత మాట్లాడుతూ.. ” రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభం చేసిన నాలుగు పథకాలు అమలుకు నోచుకోలేదు. రేవంత్ రెడ్డి ప్రారంభించిన పెట్రోల్ బంకులతో మహిళలకు లాభం జరగదు. కోటిమంది మహిళలను కోటేశ్వరులను చేస్తామని సీఎం అన్నారు. సీతక్క చెప్పిన పథకాలు పదిమంది మహిళలకు మాత్రమే ఉపయోగం జరుగుతుంది. ప్రతి మహిళకు రూ.2,500 ఇచ్చే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలి. కేసీఆర్ సీఎం అయ్యాక మహిళలకు రూ.5 లక్షల నుండి రూ.20 లక్షల వరకు రుణాలు ఇవ్వడం ప్రారంభించారు. మహిళలకు రూ.20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.వడ్డీ రాయితీని మహిళలకు ప్రభుత్వం మార్చి 8 వ తేదీ వరకు చెల్లించాలి. వితంతువులు అయిన మహిళలకు పింఛన్ ఇవ్వలేదు.
పింఛన్ రూ. 2,000 నుండి రూ.4,000 ఇస్తామని చెప్పారు. గ్రామాల్లో కొత్తగా ఒక్క మహిళకు పింఛన్ ఇవ్వలేదు. మహిళలకు అభయహస్తం డబ్బులు ఇవ్వాలి. రాష్ట్రంలో మహిళలపై 20 శాతం క్రైం రేట్ పెరిగిందని డీజీపీ చెప్పారు. మహిళలపై దాడులు నియంత్రణకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి?. కేసీఆర్ కిట్‌ను ప్రభుత్వం ఆపివేసింది. కేసీఆర్ పేరు ఇష్టం లేకపోతే కిట్ కు సోనియాగాంధీ పేరు రాజీవ్ గాంధీ పేరు పెట్టుకోండి.
మిడ్డే మీల్స్ లో పని చేసే మహిళలకు జీతాలు పెంచాలి. కేసీఆర్ హయాంలో 3 సార్లు అంగన్ వాడీల జీతాలు పెంచారు. చదువుకునే ఆడబిడ్డలకు ఫీజు రియంబర్స్ మెంట్ ఇవ్వడం లేదు. 10 వేల పోస్టు కార్డులను సేకరించి జాగృతి ఆధ్వర్యంలో సోనియాగాంధీకి పంపుతాము. మార్చి 8వ తేదీన ఆడబిడ్డలకు రూ. 2,500 ఇస్తున్నట్లు ప్రకటించకపోతే సోనియాగాంధీకి పోస్టు కార్డులు పంపుతాము. మామూనూరు ఎయిర్ పోర్టుకు రాణి రుద్రమ పేరు పెట్టాలి. రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళ పేర్లు పెట్టవద్దు. రాణి రుద్రమ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తాము” .. అని కవిత అన్నారు.