కూటమి సర్కార్ పై అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు లిక్కర్ పై శ్వేతపత్రం విడుదల చేసి.. అన్ని అబద్ధాలే చెప్పారని .. చంద్రబాబుకు దమ్ముంటే లిక్కర్ టెండర్లు రద్దు చేయాలన్నారు. బాగా తాగి పడిపోయినవాడు కూడా చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పడని తమ్మినేని విమర్శించారు. 2014-19 వరకు ఏపీలో మద్యం ఏరులై పారిందన్నారు. 2019 తర్వాత ఏపీలో 4 వేల 380 మద్యం దుకాణాలను 2 వేల 934కు తగ్గించి.. 43 వేల బెల్ట్ షాప్ లను రద్దు చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా బార్లకు లైసెన్స్ ఇవ్వలేదన్నారు. ఇప్పుడున్న బ్రాండ్ లన్నీ 2019 కి ముందు చంద్రబాబు అనుమతి ఇచ్చినవేనని తమ్మినేని అన్నారు.
భూముల విషయంలో కూడా చంద్రబాబు విడుదల చేసినవి శ్వేత పత్రాలు కావని అబద్దాల పత్రాలని తమ్మినేని సీతారాం అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో భూముల విషయంలో అందరూ చాలా ఇబ్బందులు పడ్డారని.. వారి భూమి ఎక్కడుందో ఎవరికీ తెలిసేది కాదన్నారు. చుక్కల భూములు, ఇనామ్ భూములు, 20 ఏళ్ల అసైన్డ్ భూములకు సర్వ హక్కులు కల్పించింది వైసీపీ ప్రభుత్వమేనన్నారు. చంద్రబాబు సర్కార్ కు వాటిని రద్దు చేసే దమ్ముందా అని తమ్మినేని ప్రశ్నిచారు.