స్వతంత్ర వెబ్ డెస్క్: తిరుమలలో ఈ రోజు కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారం రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నా.. భక్తులు మాత్రం వర్షాలకు కూడా భయపడకుండా శ్రీవారి దర్శనానికి పోటెత్తుతున్నారు. టోకెన్ రహిత శ్రీవారి సర్వ దర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో కూడా భక్తులు వేచి ఉన్నారు. ఇక స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
అలాగే గురువారం శ్రీవారిని 63,932 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 25,862 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు..నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్ల రూపాయలు.. వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తాత్కాలికంగా బస చేయడానికి వీలుగా ..విశాఖకు చెందిన దాత శ్రీమూర్తి విరాళంగా అందజేసిన రెండు మొబైల్ కంటైనర్లను గురువారం టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి.. ఈవో శ్రఏవీ ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. జీఎన్సీ వద్ద గల టీటీడీ ట్రాన్సుపోర్ట్ డిపోలో విధులు ముగించుకుని డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు ఒక కంటైనర్‌ను కేటాయించారు. మరో కంటైనర్‌ను రాంభగీచా -3 ఎదురుగా ఏర్పాటు చేశారు.
తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉందని, నూతన విశ్రాంతి గదుల నిర్మాణానికి అనుమతి లేదని టీటీడీ ఛైర్మన్ చెప్పారు. అందుకే కొన్నిచోట్ల ఉన్న పాత విశ్రాంతి గృహాలను పునర్నిర్మాణం చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఇలాంటి సమయంలో మొబైల్ కంటైనర్లను దాత అందించారని.. ఇందులో భక్తులు బస చేసేందుకు పరుపులు, స్నానపు గది, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు ఉన్నాయని..వాటిని భక్తులు ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఈ కంటైనర్ల విలువ దాదాపు రూ.25 లక్షలు అని టీటీడీ చైర్మన్ తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు..వాళ్లు వినియోగించుకునేందుకు వీలుగా రాబోయే రోజుల్లో వివిధ ప్రాంతాల్లో ఇలాంటి కంటైనర్లను ఏర్పాటు చేస్తామన్నారు.