స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: బీఆర్ ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో రాష్ట్ర బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మరోసారి భేటీ అయ్యారు. హైదరాబాద్ నగర శివారు లోని ఓ ఫామ్ హౌస్ లో దాదాపు నాలుగు గంటలుగా చర్చించుకున్నారు. గన్ మెన్లు, సెక్యూరిటీ సిబ్బంది లేకుండానే.. నేతలు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణాలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ పార్టీ బలోపేతం పై ఫోకస్ చేసింది. అందులో భాగంగానే ఇతర పార్టీలలోని అసంతృప్త నేతలతో పాటు.. బయటికి వచ్చిన వారితో మంతనాలు జరుపుతున్నారు. ఇటీవల ఖమ్మంలోని పొంగులేటి నివాసానికి వెళ్లిన బీజేపీ ముఖ్యనేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు.. జూపల్లి కృష్ణారావు తో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని.. ఏ పార్టీలో చేరాలనేది ఇప్పుడే నిర్ణయం తీసుకోబోమని భేటీ అనంతరం పొంగులేటి, జూపల్లి ప్రకటించారు. ఇప్పుడు మరోసారి ఈటల, పొంగులేటి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.