స్వతంత్ర వెబ్ డెస్క్: సీనియర్ నటుడు శరత్‌బాబు మరణవార్తను మరవక ముందే సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు కె.వాసు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన… హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వాసు మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఈయన స్వస్థలం కృష్ణాజిల్లా ముదునూరు.
సీనియర్ దర్శకుడు కె.ప్రత్యగాత్మ కుమారుడైన కె.వాసు.. తండ్రి బాటలోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి, ప్రేక్షకులను అలరించేలా పలు చిత్రాలు తెరకెక్కించారు. కె.వాసు దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం ‘ఆడపిల్లల తండ్రి’. కృష్ణంరాజు హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. మెగాస్టార్ చిరంజీవిని ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో ఈయనే నటుడిగా పరిచయం చేశారు. ‘కోతల రాయుడు’, ‘సరదా రాముడు’, ‘పక్కింటి అమ్మాయి’, ‘కలహాల కాపురం’, ‘అల్లుళ్ళొస్తున్నారు’, ‘కొత్త దంపతులు’, ‘ఆడపిల్ల’, ‘పుట్టినిల్లా మెట్టినిల్లా’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.