19.7 C
Hyderabad
Tuesday, January 14, 2025
spot_img

‘ షిర్డిసాయి’ దయతో విద్యుత్ ‘వెలుగు’

-ఏపీలో ఆగని ‘షిర్డిసాయి’ ‘పవర్’ మహత్యం
-వరస పెట్టి ఒకటే కంపెనీకి ఆర్డర్ల వెల్లువ
-తక్కువ రేట్లు ఇచ్చే కంపెనీలున్నా కడప కంపెనీపైనే ప్రేమ
-పదేళ్లకు సరిపడా ట్రాన్స్‌ఫార్మర్లు కొనేసిన సీపీడీసీఎల్
-నిల్వలు ఉండగనే ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు
-వాటి ఖరీదు కేవలం 956 కోట్లు మాత్రమేనట
-కొండల్లా పేరుకుపోయిన నిల్వలు
-కొన్న ట్రాన్స్‌ఫార్మర్లు ఎక్కడ దాచాలి?
-ట్రాన్స్‌ఫార్మర్లు దాచేందుకు స్థలం లేని వైచిత్రి
-నేలమీదనే ఎండకు ఎండి వానకు తడుస్తున్న ట్రాన్స్‌ఫార్మర్లు
-10 వేల రూపాయల ఎంసీబీని 35 వేలకు కొన్న దాతృత్వం
-రెండున్నర లక్షల ఖరీదయ్యే 11 కెవీ ట్రాన్స్‌ఫార్మరు 5 లక్షలకు కొనుగోలు
-5 లక్షల ఖరీదయ్యే 33 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఎనిమిదిన్నర లక్షలకు కొనేసిన విశాల హృదయం
-ఇప్పటికే స్మార్ట్‌మీటర్ల కొనుగోలులో జరిగిన 5 వేల కోట్ల అక్రమాలపై టీడీపీ యాగీ
-కొన్న వాటిలో పనికొచ్చేవెన్నో పైవాడికెరుక?
-ఏపీఎస్పీడీసీఎల్‌లో కొను‘గోల్‌మాల్’పై రచ్చ
-విచారణకు విపక్షాల డిమాండ్

( మార్తి సుబ్రహ్మణ్యం)

మీరు ఇంట్లో సరుకులు కొనాలనుకుని సూపర్‌మార్కెట్‌కు వెళ్లారనుకోండి. ఏం చేస్తారు? ఒక వారానికో, ఒక నెలకో సరిపడా సరుకులు కొంటారు. అది కూడా మీ ఆదాయం బట్టి. అంతేగానీ పదేళ్లకి ఒకేసారి, బుద్ధి- బుర్ర ఉన్నవాళ్లెవరూ కొనరు.

అదే ఒక ప్రభుత్వ శాఖలో పేపర్లు, పెన్నులు, ప్రింటర్ల ఇంకు, చీపుర్లు వంటి సామాన్లను క్వార్టర్లీ, హాఫ్ ఇయర్ పద్ధతిలో ఇండెంట్ పెడతారు. ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో అనుమతించి, సరఫరా చేస్తుంది. అంతేగానీ.. పదేళ్లకి సరిపడా వస్తువులన్నీ ఒకేసారి సరఫరా చేయదు. అదే ఒక వైన్‌షాపు ఉందనుకోండి. ఆ షాపు డిమాండ్ బట్టి, బ్రాండుల అమ్మకాల బట్టి కొనుగోలు చేస్తారు.అంతేగానీ పదేళ్లకి సరిపడా బాటిళ్లను ఒకేసారి ఎవరూ కొనరు.

అయితే ఈ కొనుగోళ్లు అన్నీ ఒకే చోట చేయరు. పది షాపులు తిరిగి రేట్లు కనుక్కొని, అందులో ఎక్కడ తక్కువ రేటు- ఎక్కువ నాణ్యత ఉన్నదో అక్కడ కొంటారు. అంతేగానీ.. పదేళ్లకు సరిపడా సరుకులు మెడ మీద తల ఉన్న ఎవరూ కొనరు. ఇదంతా రోజువారీ జీవితంలో మనందరికీ ఎదురయ్యే అనుభవాలే. ఇవన్నీ వ్యక్తుల నుంచి వ్యవస్థల వరకూ చూపే ముందుజాగ్రత్త.

మరి అదే ఒక బాధ్యత గల ప్రభుత్వ సంస్థ, ఇంకెంత జాగ్రత్తగా వ్యవహరించాలి? ఇంకెంత పొదుపుగా ఖర్చు పెట్టాలి? గీచి గీచి బేరం ఆడాలి కదా? ఎంత అవసరమో అంతే కొనాలి కదా? అసలే ఎక్కడా అప్పు పుట్టని పరిస్థితి. ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలివ్వలేని దుస్థితి. స్వయంగా విద్యుత్ శాఖ కాంట్రాక్టర్లకే, బిల్లులు చెల్లించలేని దయనీయం. మరి అలాంటి క్లిష్ట సమయంలో, కొనుగోళ్లు ఎంత ప్లానింగ్‌తో ఉండాలి? అవసరమైన మేరకే కదా కొనుగోలు చేయాలి? అవి ఖాళీ అయిన తర్వాత కదా కొత్తవి ఆర్డరు ఇవ్వాలి?

కానీ ఘనత వహించిన సీపీడీసీఎల్ బాసులు మాత్రం, ట్రాన్స్‌ఫార్మర్లను పప్పుబెల్లాలు కూడా ఈర్ష్యపడే స్థాయిలో కొని‘పారేశారు’. పోనీ ఆ కొనుగోళ్లు కూడా, బేరం చేసి కొన్నారా అంటే అదీలేదు. కారుచౌకగా ఇచ్చే పెద్ద కంపెనీలను కాదని, వేలరూపాయల ఎక్కువిచ్చి మరీ, ‘కడప కంపెనీ’ కడుపు నింపేశారు. ‘కోటప్పకొండంత ఎత్తున’ పేరుకుపోయిన ఆ ట్రాన్స్‌ఫార్మర్లకు, ఇప్పుడు నిలువనీడ లేదు. దాచటానికి సరిపడా గూడు లేదు. అక్షరాలా 956 కోట్ల రూపాయలతో ‘కడప కంపెనీ’ కడుపు నింపిన ఆ ట్రాన్స్‌ఫార్మర్లు ..అనాధప్రేతల్లా ఆఫీసు గోడౌన్లు, ఆవరణల మధ్య ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నాయి.

స్మార్ట్‌మీటర్ల కొనుగోలు నుంచి… వరస వెంట వరస తన ‘పవర్’ చూపిస్తున్న, ఆ ‘షిర్డిసాయి’ మహత్మ్యం వింటే మీరే షాకయిపోతారు. కొనుగోళ్ల కథ వింటే.. 33 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌లో వేలు పెట్టినంత షాక్ తగులుతుందంతే!

మార్కెట్‌లో ఒక ఎంసీబీ ఖరీదు 10 వేల రూపాయలు. కానీ కడప కంపెనీకి సీపీడీసీఎల్ పెద్దలు 35 వేల రూపాయలు పోసి కొనేస్తున్నారు. బీహెచ్‌ఈఎల్, ఎల్ అండ్ టీ, ఏబీవీ వంటి లబ్ధ ప్రతిష్ఠ కంపెనీలన్నీ.. హై ఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు 11 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను రెండున్నర లక్షలు, 33 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను 5 లక్షలకే ఇస్తున్నాయి. వీటికి ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలో సుదీర్ఘ అనుభవం ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ కంపెనీల ట్రాన్స్‌ఫార్మర్లే కొంటున్నారు.

కానీ సదరు కడప కంపెనీ నుంచి.. అదే 11 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను 5 లక్షలు, అదే 33 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎనిమిదిన్నర లక్షల రూపాయలకు, సీపీడీసీఎల్ ఖరీదు చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. వీటి వెనుక మారిన చేతుల కథ తేల్చేందుకు, విచారణ జరిపించాలని విపక్షాలు పట్టుపడుతున్నాయి. ఇప్పటికే స్మార్ట్‌మీటర్ల కొనుగోళ్లపై గళం విప్పిన టీడీపీ, ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మర్ల కుంభకోణంపై యాగీ చేస్తోంది.

రాష్ట్రంలో-దేశంలో ఎన్నో లబ్ధప్రతిష్ఠ కంపెనీలుండగా… స్మార్ట్‌మీటర్లు సరఫరా చేసే ఒక్క కడప కంపెనీపై మాత్రమే ‘షిర్డిసాయి’ దయచూపుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గుంటూరు-విజయవాడ-ఒంగోలు జిల్లాలకు కరెంటు సరఫరా చేసే సీపీడీసీఎల్ … డిమాండ్-అవసరానికి మించి గుట్టలుగా కొనుగోలు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ల రక్షణ, ఇప్పుడు తలకుమించిన భారంగా పరిణమించింది.

ఈ మూడు జిల్లాల్లోని స్టోర్లలో నిలువెత్తు ట్రాన్స్‌ఫార్లన్లు గుట్టలుగా పడిఉన్న వైనం, వాటి రక్షణ అధికారులకు సవాలుగా పరిణమించింది. ఆయా కార్యాలయాల ఆవరణలో ఆరుబయటే కొండంత పెరిగి కనిపిస్తున్న ట్రాన్స్‌ఫార్మర్లు. ఎండకు ఎండి, వానకు తడుస్తున్నాయి. ఫలితంగా ఇప్పుడు వాటిలో పనికివచ్చేవి ఎన్ని? పనికిరానివి ఎన్నో చెప్పలేని-గుర్తించలేని పరిస్థితి.

మరి ఆ స్థాయిలో రాశులు పోసి, గుట్టలుగా పెరిగిన ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు ఇప్పటి పరిస్థితికి అవసరమా? అంటే సూటిగా సమాధానం ఇచ్చే వారు లే రు. పోనీ ప్రస్తుతం ట్రాన్స్‌ఫార్మర్ల నిల్వలు లేవా అంటే.. నిక్షేపంగా కావలసినన్ని ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులోనే ఉన్నాయని సమాచారం. నిజానికి గత ఏడాది ఏప్రిల్ వరకూ దాదాపు 88,88,203 ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. వాటి విలువ 145 కోట్ల రూపాయలట.

సాధారణంగా అయితే, నిల్వలు అడుగంటినప్పుడు కొద్దిరోజుల ముందు కొత్త ట్రాన్స్‌ఫార్మర్లకు ఆర్డర్ ఇస్తుంటారని చెబుతున్నారు. దానికీ పెద్ద తతంగమే ఉంటుంది. తక్కువ రేటు ఇచ్చే కంపెనీల నుంచి వాటిని కొనుగోలు చేస్తుంటారు. ఈ పోటీలో సహజంగా, జాతీయ స్థాయి కంపెనీలే దిగుతుంటాయి.

అయితే ఎప్పుడూ లోకల్ కంపెనీలకు ఇవి దక్కిన దాఖలాలు లేవంటున్నారు. సహజంగా ఇదే పద్ధతి చాలా ఏళ్ల నుంచి అమలుచేస్తున్నారు.కానీ ఈసారి మాత్రం ఇటీవలి కాలంలో విద్యుత్ శాఖలో తన ‘పవర్’ చూపిస్తున్న కడప కంపెనీకి దక్కడమే విశేషం. పాలకులకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన ఈ కంపెనీ సంపద.. గత మూడేళ్లలో ఇబ్బడిముబ్బడిగా పెరగడం వెనుక, విద్యుత్ సంస్థలో తిష్టవేసిన బంధువులే కారణమన్నది విపక్షాల ఆరోపణ.

అవసరానికి మించి కొనుగోలు చేస్తే, వాటిని నేలమీద పెడితే పనికిరావన్న ముందుచూపుతో, జాగ్రత్తగా పరిమితంగా కొనుగోలు చేస్తారు. ఎందుకంటే డి స్కమ్‌లకు నష్టం కలగకుండా, తీసుకునే ముందు జాగ్రత్త అది. కానీ ఆశ్చర్యంగా సీపీడీసీఎల్ పెద్దలు మాత్రం.. ఓ పదేళ్లకు సరిపడా ట్రాన్స్‌ఫార్మర్లు ముందస్తుగా కొని‘పారేశారు’. వాటి విలువ 956 కోట్ల రూపాయల పైమాటేనట. అంటే వారం క్రితం వరకూ 4, 44,09,492 ట్రాన్స్‌ఫార్మర్లు స్టోర్లు, ఆఫీసు ఆవరణల్లో నిల్వలున్నాయన్నమాట.

ఆ ప్రకారంగా గతేడాది ఏప్రిల్‌లో ఉన్న 88,88,203 ట్రాన్స్‌ఫార్మర్ల సంఖ్య, గత డిసెంబర్ చివరికి అమాంతం 4, 44,09,492 కి చేరాయన్నమాట. అసలు ఏడాదిన్నరలో ఇంత భారీ సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్లు కొనడం అవసరమా? ఏ ప్రాతిపదికన, ఏ డిమాండ్ ప్రకారం, వీటిని కొనుగోలు చేశారన్న ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు. ఒక వారం క్రితం వరకూ స్టోర్లకు తరలించగా 1,22, 61,706 ట్రాన్స్‌ఫార్మర్లు మిగిలే ఉన్నాయట.

సరే.. ఈ కొనుగోల్‌మాల్ కథ కాసేపలా పక్కనపెడితే.. లెక్కకుమించిన ట్రాన్స్‌ఫార్మర్లు ఎక్కడ దాచాలన్నది ఇప్పుడు అధికారులకు అర్ధం కావడం లేదు. సరైన స్టోర్లు లేక, దాచే స్థాయి లేక వాటిని ఆఫీసు ఆవరణలో నేలమీద పడేశారు. వాటిపైన షెడ్ కూడా లేకపోవడంతో అవి ఎండకు ఎండి, వానకు తడిసిపోతున్నాయి. ఫలితంగా వాటిలో ఎన్ని పనిచేస్తాయో, ఎన్ని పనిచేయవో తెలియక అధికారులు తలపట్టుకుంటున్నారు. ఇప్పటిదాకా గుంటూరులో 35,03,511 ట్రాన్స్‌ఫార్మర్లు ; విజయవాడలో 42,62,894, ఒంగోలులో 35,66,973 ట్రాన్స్‌ఫార్మర్లు మిగిలిపోయినట్లు తెలుస్తోంది.

సహజంగా వ్యవసాయ ఫీడర్లు త్వరగా పాడయిపోతుంటే, కొత్తవి కొని మారుస్తుంటారని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత సరఫరా తీరును బట్టి, వ్యవసాయ ఫీడర్లు త్వరగా పాడయిపోతున్నట్లు అర్ధం చేసుకోవలసి వస్తోందంటున్నారు. అంటే వాటి నాణ్యతను అనుమానించాల్సిన అవసరం ఉందంటున్నారు. నిజంగా అదే జరిగితే సీపీడీసీఎల్ కు సరఫరా చేసే కంపెనీని, బ్లాక్‌లో పెట్టడం అధికారుల విధి అని స్పష్టం చేస్తున్నారు. ఆ పనిచేయకుండా మళ్లీ కొత్తవి కొనడం వల్ల ఎవరికి లాభం అని ప్రశ్నిస్తున్నారు.

కాగా ఇప్పటికే స్మార్ట్‌మీటర్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై టీడీపీ విరుచుకుపడుతోంది. ఒక్కో స్మార్ట్‌మీటర్ల బిగింపు-నిర్వహణకు 800 రూపాయలవుతుంటే, 12 వేలని చెప్పడం అక్రమమని టీడీపీ యాగీ చేస్తోంది. అందులో 5 వేల కోట్ల దోపిడీకి రంగం సిద్ధం చేశారన్నది టీడీపీ ఆరోపణ. నిజానికి మహారాష్ట్రలో అదే పనికి 7 నుంచి 8వందలు తీసుకుంటున్నారని ఉదహరిస్తోంది. 5 వేల కోట్ల కిక్‌ బ్యాక్‌ కుంభకోణంలో షిర్డిసాయి కంపెనీకే దక్కేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించిందని, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి చేసిన ఆరోపణ సంచలనం సృష్టించింది.

ఇప్పుడు తాజాగా వెలుగుచూసిన.. ట్రాన్స్‌ఫార్మర్ల అనవసర కొనుగోళ్లపైనా, టీడీపీ గళమెత్తుతోంది. 956 కోట ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలుపై విచారణ చేయాలని జీవీ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Latest Articles

జమ్ముకశ్మీర్‌లో జడ్‌-మోడ్‌ సొరంగం.. సైన్యానికి కీలకం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్ముకశ్మీర్‌ గాందర్‌బల్‌ జిల్లాలో నిర్మించిన జడ్‌-మోడ్‌ సొరంగాన్ని ప్రారంభించారు. అనంతరం టన్నెల్‌ లోపలికి వెళ్లి పరిశీలించారు. శ్రీనగర్‌-లేహ్‌ జాతీయ రహదారిపై సోన్‌మార్గ్‌ ప్రాంతంలో రూ.2,700 కోట్లతో జడ్‌-మోడ్‌ టన్నెల్‌ను నిర్మించారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్