దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.0గా నమోదైంది. ధౌలా కాన్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కాలేజీ సమీపంలో 5 కిలోమీటర్ల భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రకంపనలు సంభవించిన సమయంలో భారీ శబ్దం వినిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
మరోవైపు భూకంపంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని అన్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భద్రతా చర్యలు పాటించాలన్నారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కోరారు. పరిస్థితులను అధికారులు సునిశితంగా పరిశీలిస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు.