సంక్రాంతి అంటేనే సరదాల పండుగ. రైతుల పండుగ. ఇంటి ముందు అందమైన రంగవల్లులు, గొబ్చెమ్మలు, డూడూ బసవన్నలు.. ఇలా సందడిగా జరుపుకుంటున్నారు. గ్రామాల్లో అయితే పెద్ద పెద్ద ముగ్గులు వేసి మహిళలు పోటీ పడుతుంటారు. ఎవరి ముగ్గు పెద్దది.. ఎవరి ముగ్గు కలర్ ఫుల్‌గా ఉంది..ఇలా పోటీ పడి మరీ ముగ్గులు వేస్తుంటారు. భోగి రోజు భోగి కుండలు, సంక్రాంతి పండుగ రోజు పీటల ముగ్గు, కనుమ రోజు రథం ముగ్గు వేస్తుంటారు. సంక్రాంతి పండుగకు ముగ్గులోనే శుభాకాంక్షలు చెబుతారు. కానీ ఓ మహిళ మాత్రం ఇందుకు భిన్నంగా రంగవల్లికను తీర్చిదిద్దింది. ఇందులో సందేశం కూడా ఇచ్చింది. అంతేకాదు సోషల్ మీడియాలో ఉండే నెటిజన్లకు ఓ వార్నింగ్ కూడా ఇచ్చింది.
నందికొట్కూరు సాయిబాబా పేటకు చెందిన అనుష అనే జనసేన వీర మహిళ ఆమె ఇంటి ముందు సందేశాత్మకమైన ముగ్గును వేసింది. భోగి పండుగ సందర్శంగా జనసేన జెండాతో పాటు సోషల్ మీడియా బోమ్మలతో ముగ్గును తీర్చిదిద్దింది. యువత సోషల్ మీడియాకు బానిస కాకూడదంటూ డోంట్ అడిక్ట్ అంటూ వాట్సాప్, ఫేస్‌బుక్, ఇంస్టాగ్రామ్‌లలో వచ్చే లింకులను ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని ముగ్గుతో సందేశమిచ్చారు. సందేశాత్మక ముగ్గు వేయడంతో జనసేన వీర మహిళ అనుషను కాలనీ వాసులు అభినందిస్తున్నారు.


