హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. కరీంనగర్ రెండో అదనపు మెజిస్ట్రేట్ బెయిల్‌ను మంజూరు చేశారు. మూడు కేసుల్లోనూ బెయిల్ ఇస్తూ జడ్జి తీర్పు నిచ్చారు. 25 వేల రూపాయల పూచికత్తు సమర్పించాలని కౌశిక్ రెడ్డికి జడ్జి సూచించారు. పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌ను జడ్జి తిరస్కరించారు.
కరీంనగర్ సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పట్ల పాడి కౌశికర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించాడని ఆయన పీఎ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంజయ్ పీఏ ఫిర్యాదు మేరకు పోలీసులు కౌశిక్ రెడ్డిని నిన్న రాత్రి జూబ్లిహిల్స్ చెక్ పోస్టు వద్ద అదుపులోకి తీసుకుని కరీంనగర్ తరలించారు. నిన్న రాత్రి కరీంనగర్ పీఎస్‌లోనే ఉన్న కౌశిక్ రెడ్డికి ఇవాళ ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం జడ్జి ముందు ప్రవేశ పెట్టారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసులు పెట్టిన రిమాండ్ రిపోర్ట్‌ను తొలగించాలని ఆయన తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న కరీంనగర్ రెండో అదనపు మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చారు.
3 కేసుల్లో కౌశిక్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. గురువారం లోగా రూ. 2 లక్షలు పూచీకత్తు సమర్పించాలని కరీంనగర్ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రేమలత ఆదేశించారు. పోలీసులు పిలిచిన సమయంలో విచరాణకు హాజరుకావాలని షరతులు పెట్టారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని కోర్టుకు కౌశిక్ రెడ్డి చెప్పారు.
అంతకుముందు మాట్లాడిన కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటానని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వదలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.