స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంక్షేమ పథకాల అమలులో అధికార బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ప్రజలకు లబ్ధి చేకూరేలా వివిధ పథకాలను వారికి చేరువ చేస్తుంది. గత రెండు నెలల వ్యవధిలోనే రెండో విడత గొర్రెల పంపిణీ, పోడు పట్టాల పంపిణీ, దళితబంధు, బీసీలకు రూ. లక్ష ఆర్థిక సాయం, రైతు బంధు, మైనార్టీలకు రూ. లక్ష సాయం ప్రకటించింది. నేటి నుంచి రైతు రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. తాజాగా మంత్రి కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదలకు గుడ్‌న్యూస్ చెప్పారు.
గ్రేటర్ పరిధిలో నిర్మించిన లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ ఈనెల 15 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. నియోజకవర్గానికి 4 వేలు చొప్పున గ్రేటర్ పరిధిలో నిరుపేదలకు రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ చేస్తామన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 37 కాలనీలు ఎన్నో ఏళ్లుగా భూసమస్యను ఎదుర్కొంటుండగా.. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన 118 జీవో మేరకు 18 వేల కుటుంబాలకు కన్వేయన్స్ డీడ్‌ల పంపిణీ కార్యక్రమం బుధవారం నియోజకవర్గంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్.. ఈనెల 15 నుంచి డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ చేపడతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి 3 వేల కుటుంబాలకు చొప్పున సొంతస్థలంలో ఇళ్లు నిర్మించుకోవడానికి గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల ఆర్థికసాయాన్ని అందజేస్తామని కేటీఆర్ వెల్లడించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడం సీఎం కేసీఆర్ స్వప్నమని.. ఆయన నిబద్ధతతో ఐదారేళ్ల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఖాయమని.. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మూసీ నదిపై దుర్గం చెరువు తీగల వంతెన తరహాలో 14 ఆకర్షణీయమైన బ్రిడ్జిలు నిర్మించనున్నట్లు తెలిపారు.
ఇందుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు ఓఆర్‌ఆర్ పొడవునా, ఇతర ప్రాంతాల్లో మొత్తం 415 కి.మీ.ల మేర మెట్రోను విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ తన పాలన దక్షతతో జాతీయ తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ విజయాన్ని కట్టబెట్టాలని కోరారు. ఐదేళ్ల పదవీ కాలంలో ఆరు నెలలు మాత్రమే ఎన్నికలకు కేటాయించి.. మిగిలిన నాలుగున్నరేళ్లు అభివృద్ధి కోసం పనిచేసే కేసీఆర్ ప్రభుత్వాన్ని గెలిపించాలని కేటీఆర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.