తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ జయమ్మ కాలనీకి చెందిన వానరాసి జంపన్న, దుర్గ దంపతులు. వారం కిందట బతుకుదెరువు కోసం తమ చిన్నారి సాయి దేవాన్ష్‌ను తీసుకుని సత్తుపల్లికి వలసవచ్చారు. స్థానిక గుడిపాడు రోడ్డు శివారులోని ప్రైవేటు భూముల్లో డేరాలు వేసుకుని తలదాచుకుంటున్నారు. జంపన్న గ్యాస్ పొయ్యిలను రిపేర్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎప్పటిలాగే తమ గుడారంలో నిద్రపోతుండగా.. ఒంటి గంట సమయంలో తల్లి దుర్గకు మెలకువ వచ్చి చూడగా దేవాన్ష్ కన్పించలేదు.తన భర్తతో కలిసి చుట్టు పక్కల డేరాలు వేసుకున్న వారి వద్దకు వెళ్లి ఆరా తీశారు. స్థానికులతో కలిసి ఆ ఏరియా మొత్తాన్ని జల్లెడపట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. దీంతో దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కగానొక్క కొడుకు కన్పించకుండా పోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.