ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఆయన డిస్ట్రిబ్యూటర్(Distributor)గా కెరీర్ మొదలుపెట్టి తెలుగు చిత్రపరిశ్రమను ఏలుతున్న సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. ఇప్పటికే సినిమాల్లో తన స్టామినా ఏంటో నిరూపించుకున్న దిల్ రాజు.. ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేయాలని తహతహలాడుతున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా సిరిసిల్ల(Sircilla)లో జరిగిన తన బలగం(Balagam) సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో ఆయన మాటలను ప్రస్తావిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యహరిస్తున్న దిల్ రాజు.. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు మంత్రి కేటీఆర్(KTR) ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ దిల్ రాజును అభినందించారు. సిరిసిల్ల(Sircilla)లో సినిమా ఫంక్షన్ చేపట్టిన ఘనత రాజు దక్కించుకున్నారని కొనియాడారు. అలాగే దిల్ రాజు(Dil Raju)కూడా కేటీఆర్, కేసీఆర్(KCR)లను పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని కేటీఆర్ ను ఆకాశానికెత్తారు. ఇవన్ని చూస్తుంటే ఆయన కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నట్లు అర్థమవుతోందని వెల్లడిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని అనుమానిస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో తన సొంత జిల్లా అయిన నిజామాబాద్(Nizamabad)లో తెగ పర్యటిస్తున్నారని అంటున్నారు. ఏ నియోజకర్గం నుంచి పోటీ చేస్తే ఈజీగా గెలవొచ్చో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టినట్లు కూడా విశ్లేషిస్తున్నారు.