స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో సర్పంచ్‌లు అప్పులు తెచ్చి మరీ గ్రామాలలో పనులు చేస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeshwari) అన్నారు. ఆర్థిక సంఘం నిధులను మళ్లించి పంచాయతీరాజ్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందంటూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో బీజేపీ నిరసన, ధర్నా చేపట్టింది. పురందేశ్వరి ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అప్పులు తెచ్చి గ్రామాల్లో పనులు చేస్తున్న సర్పంచ్‌లు, ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్య(Suicide) చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బిల్లులు చెల్లించకపోవడంతో గ్రామాల్లో పనులు చేపట్టిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ప్రాణాలు తీసుకుంటున్నారన్నారు. ఈ పాపం అంతా జగన్ (CM Jagan) ప్రభుత్వానిదే అని ఆరోపించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలపై మాట్లాడే ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడైనా సర్పంచ్‌ల గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు. సర్పంచ్‌ల వ్యవస్థను అవమానిస్తున్నారని వారు తెలిపారు.