ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు భక్తుల తాకిడి పెరిగింది. మాఘ పౌర్ణమి నేపథ్యంలో పుణ్యస్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు గంగమ్మలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. మాఘ పౌర్ణమి వేళ త్రివేణీ సంగమానికి మూడు నుంచి నాలుగు కోట్ల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో భక్తులు, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ స్నానాలు రోజంతా కొనసాగుతాయని, సుమారు 10 లక్షల మంది కల్పవాసీలు దీక్ష విరమిస్తారని చెప్పారు. కాగా.. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులపై హెలికాప్టర్ ద్వారా పుష్ప వర్షం కురిపించారు.
కుంభమేళాలో ఐదో పవిత్ర స్నానాలు కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులు పోటెత్తారు. దీంతో ప్రయాగ్‌రాజ్ చుట్టూ 350 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌ను నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు. ఎమర్జెన్సీ, అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చినట్లు, మాఘ పౌర్ణమి స్నానాలు ముగిసే వరకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. మాఘ పూర్ణిమ తర్వాత ఈ నెల 26 శివరాత్రి రోజున అధిక సంఖ్యలో భక్తులు స్నానమాచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
మౌని అమావాస్య రోజున తొక్కిసలాట జరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు పకడ్బందీగా చేశామని అధికారులు అన్నారు. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోయాయని తెలిపారు. మహాకుంభమేళా ప్రారంభమై నేటికి 31 రోజులు. జనవరి 13న ప్రారంభమైన మేళా.. మహాశివరాత్రితో ముగియనుంది. ఇప్పటివరకు 46.25 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు.
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకి భక్తులు ఊహించని స్థాయిలో పోటెత్తుతున్నారు. కుంభమేళా జరిగే 45 రోజుల్లో మొత్తంగా 45 కోట్ల మంది భక్తులు పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేయగా, కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆ సంఖ్య దాటిపోయింది.