ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ క్యాంపెయిన్ పోటాపోటీగా సాగింది. బీజేపీ తరపున మోదీ, అమిత్ షా, ఎన్డీఏ నేతలు ప్రచారం చేయగా.. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంక, ఖర్గే పాల్గొన్నారు. 70 అసెంబ్లీ స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఈనెల 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. వరుసగా నాలుగో సారి విజయం సాధించి అధికారాన్ని దక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది.
మరోవైపు మూడు దశాబ్దాలుగా ఢిల్లీలో అధికార పీఠానికి దూరంగా ఉన్న బీజేపీ.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇక.. ఇండియా కూటమిలోనే ఉన్న కాంగ్రెస్.. ఢిల్లీలో తన మిత్రపక్షమైన ఆప్‌పై పోటికి దిగింది. ఆప్, కాంగ్రెస్ 70 చోట్ల పోటీ చేస్తుండగా.. బీజేపీ 68 స్థానాల్లో పోటీకి దిగింది. మిగిలిన రెండు సీట్లను జేడీయూ, ఎల్‌జేపీకి కేటాయించింది. సీపీఐ 6, సీపీఎం 2, సీపీఐ ఎంఎల్ 2 సీట్లలో పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ 70, ఎన్సీపీ 30, ఏఎస్పీ 15, AIMIM రెండు చోట్ల బరిలోకి దిగాయి.


