స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. ఇక బీజేపీ సహా ఇతర పార్టీలు తమ అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని ఇప్పటికే టీడీపీ, జనసేన, వైఎస్సార్టీపీ, ప్రజాశాంతి పార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా జనసేన 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పోటీపై మరో రెండు మూడ్రోజుల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ జనసేన వెల్లడించింది. హైదరాబాద్‌లోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్‌తో భేటీ అయి.. ఎన్నికల్లో పోటీపై పార్టీ నేతల అభిప్రాయాలను ఆయనకు వివరించినట్టు రాష్ట్ర నాయకత్వం పేర్కొంది. కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదని గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నామని తెలిపింది. మిత్రపక్షమైన బీజేపీ విజ్ఞప్తి మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుంటే క్యాడర్ బలహీనపడే అవకాశం ఉన్న నేపథ్యంలో పోటీ చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. ఈ విషయంపై మరో మూడ్రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.