ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తప్పు చేశానని ఆయన భావిస్తున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే నిజమే అనక తప్పదు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలిచిన దానం.. వివాదాస్పదమైన ఎమ్మెల్యేగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో లాఠీ పట్టుకొని ఉద్యమ కారులపై దాడికి వచ్చిన దానం నాగేందర్‌ను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అలా ఉద్యమంపై వ్యతిరేకంగా వ్యవహరించిన దానంను.. ఆ తర్వాత కాలంలో కేసీఆర్ దగ్గరకు తీసి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. ఆ పార్టీలో కూడా దానం తన పరపతి తగ్గకుండా కాపాడుకున్నారు. మంత్రి పదవి రాకపోయినా.. దానంకు కేసీఆర్, కేటీఆర్ వంటి నాయకులతో ఎప్పుడూ సన్నిహిత సంబంధాలు ఉండేవి. జీహెచ్ఎంసీ పరిధిలో అప్పటి మంత్రి తలసాని తర్వాత.. దానం ప్రభావమే ఎక్కువగా ఉండేది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత.. ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. గతంలో కూడా దానంకు పార్టీలు మారిన చరిత్ర ఉంది. కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో టికెట్ రాకపోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. కానీ కొంత కాలానికే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అప్పట్లో టికెట్ రాలేదనే ఆవేదనతో పార్టీ మారారు. కానీ ఆ తర్వాత కాలంలో అధికారం ఎక్కడ ఉంటే అక్కడ చేరిపోవడం మొదలు పెట్టారు. 2014లో కాంగ్రెస్ తరపున ఓడిపోయిన తర్వాత అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌లో చేరారు. ఇక 2024 మార్చిలో బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్‌లోకి వచ్చారు. దానం నాగేందర్ పార్టీ మారడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఇక నాగేందర్ అయితే కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లను టార్గెట్ చేసి మాట్లాడారు.
ఇక అసెంబ్లీలో అయితే దానం నాగేందర్ బీఆర్ఎస్ సభ్యుడిగా ఉంటూనే.. అదే పార్టీ ఎమ్మెల్యేలపై బూతులతో విరుచుకపడ్డారు. తోలు తీస్తా.. బయట కూడా తిరగనివ్వను అంటూ అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించారు. మరోవైపు దానం నాగేందర్ పార్టీ మారడంపై బీఆర్ఎస్.. స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా హైకోర్టులో కేసు కూడా వేసింది. అప్పటికే దానం నాగేందర్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఫామ్ మీద సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. దీంతో దానం నాగేందర్‌పై అనర్హత వేటు తప్పకుండా పడుతుందని అందరూ భావించారు. అయితే స్పీకర్ విచక్షణకే వదిలేస్తున్నామని హైకోర్టు చెప్పడంతో.. ఆ విషయం పెండింగ్‌లో పడింది. అయితే స్పీకర్ కనుక అనర్హత వేటు వేస్తే.. మొదట బలయ్యేది దానం నాగేందర్ అనే చర్చ జరుగుతోంది.
అయితే.. ఇటీవల కాలంలో దానం నాగేందర్ బయట ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. గతంలో దూకుడుగా వ్యవహరించిన దానం.. ప్రస్తుతం సైలెంట్‌గా ఉంటున్నారు. కాగా.. దానం ఇటీవల ఒక మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత.. ఆయన బీఆర్ఎస్‌కు తిరిగి దగ్గరవుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో అసెంబ్లీతో తాను మాట్లాడిన మాటల పట్ల చాలా బాధపడ్డాను.స్వయంగా కేటీఆర్‌ను కలిసి సారీ కూడా చెప్పానంటూ దానం సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో అసెంబ్లీలో ఆవేశంలో నోరు జారానని.. ఆ విషయంలో కేటీఆర్‌ను వ్యక్తిగతంగా కలిసి సారీ చెప్పినట్లు వెల్లడించారు. అంటే దానం, కేటీఆర్ మధ్య సంబంధాలు ఇప్పటికే బానే ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు ఫార్ములా ఈ రేస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవినీతి చేశాడంటూ పదే పదే వ్యాఖ్యానిస్తోంది. ప్రస్తుతం ఆ అంశంలో ఏసీబీ విచారణకు కూడా కేటీఆర్ హాజరయ్యారు. కాంగ్రెస్ మొత్తం కేటీఆర్‌ను దోషిగా పేర్కొటుంటే.. దానం నాగేందర్ మాత్రం ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచిందని వ్యాఖ్యానించారు. ఫార్ములా-ఈ రావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. అప్పట్లోనే ఫార్ములా- 1 తీసుకు రావాలని చంద్రబాబు నాయుడు అప్పట్లోనే గచ్చిబౌలిలో భూసేకరణ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల రాలేదు ఫార్ములా-ఈ రావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అనేది మాత్రం నిజం అని దానం వ్యాఖ్యానించారు.
దానం నాగేందర్ వ్యవహార శైలి చూస్తే.. ఆయన కాంగ్రెస్ పట్ల కాస్త విముఖత పెంచుకున్నట్లే కనపడుతోంది. పార్టీ మారడం వల్ల తనకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదని.. మంత్రి పదవి ఇస్తానన్న హామీ కూడా ఇప్పట్లో నెరవేరే అవకాశం లేదని దానం భావిస్తున్నారట. కాంగ్రెస్ లోనే కొనసాగితే.. వచ్చే ఎన్నికల్లో గెలవడం కూడా కష్టమే అనే భావనకు వచ్చారట. అందుకే ఆయన నెమ్మదిగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. అందుకే బీఆర్ఎస్ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారని.. తిరిగి ఆయన గులాబీ గూటికే వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో వేచి చూడాలి.