తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైరయ్యారు. తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. జాబ్ క్యాలెండ్ ప్రకటన నేపథ్యంలో ప్రసంగించిన ఎమ్మెల్యే దానం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ పరుష వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో తిరగనివ్వను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులోని వ్యాఖ్యలు తల్లిని దూషించేలా ఉండడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సైతం నాగేందర్‌ను వారించకపోవడం దారుణమని వారు చెబుతున్నారు.
ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు దానం నాగేందర్ భాష సభ్య సమాజం తల దించుకునే విధంగా ఉందన్నారు. తెలంగాణ శాసనసభలో ఇది చీకటి రోజని.. వాళ్ల బజారు భాష వినలేక తాము బయటకు వచ్చేశామన్నారు. దానం విషయ అవగాహన లేక వ్యక్తిగత దూషణలకు దిగారన్నారు. సభా మర్యాదలను, సభా గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ మంట గలిపిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
దానం నాగేందర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ నుంచి బయటకొచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేశారని, దానం అడ్డగొలుగా మాట్లాడటాన్ని నిరసిస్తూ గన్‌పార్క్ వద్ద నిరసనకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా గన్‌పార్క్ వద్ద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.