ఫిబ్రవరి.. పొట్టి నెల. తక్కువ రోజులున్న నెల. నాలుగేళ్లకు ఓ సారి వచ్చే లీప్ సంవత్సరం అయినా మిగిలిన నెలల కంటే తక్కువ రోజు.. 29 రోజులు మాత్రమే ఉంటుంది. అయితే, పిట్ట కొంచెం కూత ఘనం మాదిరి ఈ ఫిబ్రవరి కొన్ని రికార్డులు సృష్టిస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సగానికి సగం రోజులు పెళ్లి ముహూర్తాలతో కళ్యాణ మండపాలన్ని కళకళలాడాయి. ఇక తళ తళలాడే బంగారం ధర ఎన్నడూ లేనంత స్థాయికి చేరి కొండెక్కి కూర్చుంది. తానేం తక్కువ కాదని వెండి ధర, బంగారం ధరతో పరుగులు తీసింది. వీటి సంగతి ఇలా ఉండగా.. ఫిబ్రవరిలో భారీస్థాయిలో జీఎస్టీ వసూళ్లు జరిగి, గత ఏడాదితో పోలిస్తే భారీ వృద్ది సాధించింది.
దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్లు, జిఎస్టీ కలెక్షన్లు భారీస్థాయిలో నమోదయ్యాయి. ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు కోటీ 84 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైనట్టు కేంద్ర సర్కారు వెల్లడించింది. గత ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే వసూళ్లలో 9.1 శాతం వృద్ది నమోదైనట్టు తెలిపింది. జీఎస్టీ ఆదాయంలో దేశీయ రెవెన్యూ వసూళ్లు 10.2 శాతం మేర పెరిగాయని తెలిపింది. ఇది కోటీ 42 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని పేర్కొంది. దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో 5.4 శాతం వృద్దితో 41,702 కోట్ల రూపాయలుగా నమోదైందని తెలిపింది.
ఫిబ్రవరి నెలలో మొత్తం వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి. సెంట్రల్ జీఎస్టీ నుంచి 35 వేల 204 కోట్ల రూపాయలు, స్టేట్ జీఎస్టీ నుంచి 43 వేల 704 కోట్ల రూపాయలు వసూలైనట్టు కేంద్రం తెలియజేసింది. ఇక, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ నుంచి 90 వేల 870 కోట్ల రూపాయలు వసూలైనట్టు కేంద్ర గణాంకాలు తెలిపాయి. ఇదికాక, సెస్సుల రూపంలో 13 వేల 868 కోట్ల రూపాయలు సమకూరినట్టు కేంద్రం తెలిపింది. 1.96 లక్షల కోట్ల రూపాయల వసూళ్లతో ఈ ఏడాది జనవరి మాసం తన ఫస్ట్ ప్లేస్ నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే.