31 C
Hyderabad
Wednesday, February 5, 2025
spot_img

క్రైమ్‌ రిపోర్ట్‌ 2024.. ఏడాదంతా సంచలనాలే..!

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ 2024. క్యాలెండర్ పేజీల సాక్షిగా మరికొన్ని గంటల్లో 2024 కాలగర్భంలో కలిసిపోతుంది. గతాన్ని నెమరు వేసుకుంటూ వర్తమానంలో ప్రయాణించాలి కాబట్టి 2025లోకి అడుగుపెట్టేముందు… 2024ను ఒక్కసారి మననం చేసుకోవాలి. ఈ ఏడాది ఎన్నో నేరాలు…. మరెన్నో ఘోరాలు జరిగాయి. ప్రతిఏడూ నేరాలు, ఘోరాలు జరుగుతూనే ఉన్నా… ఈ ఏడు సంచలనాలకు నిలయంగా మారింది. సెలబ్రెటీల ఇష్యూలు టాక్ ఆఫ్ ది మంత్‌గా నిలిచిపోయాయి. 2024లో కలకలం రేపిన కీలక కేసుల క్రైం రౌండప్‌పై స్వతంత్ర స్పెషల్ ఫోకస్

కవిత అరెస్ట్‌

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు ఈ ఏడాది సంచలనం సృష్టించిన కేసుల్లో మొదటి వరుసలో ఉంటుంది. రాజకీయంగానూ పెను సంచలనమే సృష్టించింది. ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు వయా ఆంధ్రప్రదేశ్ వేదికగా సాగిన ఈ కుంభకోణం వ్యవహారం.. అధికార పార్టీల పీఠాలను కదిలించాయి. ఈ వ్యవహారంలో నాటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో ప్రారంభమైన అరెస్టులు కవితను అదుపులోకి తీసుకోవడం వరకు కొనసాగింది. అదిగో పులి అంటే ఇదిగో మేక అన్నట్లు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఇక కవిత అరెస్ట్ అయిపోతుందంటూ పుకార్లు వచ్చేవి. ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి 15న సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు అరెస్ట్ చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ ప్రకటించారు. ఐదున్నర నెలల పాటు సుమారు 166 రోజులుగా ఆమె జీహార్ జైలులో ఉన్నారు.

అల్లు అర్జున్‌ అరెస్ట్‌

రాజకీయాల్లో కవిత అరెస్ట్ సంచలనం అయితే…. అల్లు అర్జున్ అరెస్టుతో సినీ ఇండస్ట్రీ షేక్ అయింది. కాంగ్రెస్ ఏడాది పాలనలో సినిమా స్టార్లకు ప్రభుత్వం నుండి చురకలు తప్పలేదు. పుష్ప 2 సినిమా సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటతో ఓ మహిళ మరణించగా… ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో విడుదలైన అల్లు అర్జున్‌ను సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు పరామర్శించడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. రేవతి చనిపోయినట్లు తనకు థియేటర్‌లో ఎవరూ చెప్పలేదని… పోలీసులపై అల్లు అర్జున్ ఆరోపణలు చేశారు. కోర్టు బెయిల్ నిబంధనలను బన్నీ ఉల్లంఘించారన్న ప్రచారం జరిగింది. పోలీసులు, ప్రభుత్వంపై అల్లు అర్జున్ ఆరోపణలతో అటు కాంగ్రెస్ లీడర్లు, ఇటు పోలీస్ అధికారులు వరుస పెట్టి ప్రెస్‌మీట్లు పెట్టడంతో ప్రభుత్వం వర్సెస్ ఇండస్ట్రీగా మారింది వ్యవహారం. ఎట్టకేలకు తెలంగాణ ఫిలి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించాల్సి వచ్చింది.

ఫోన్ టాపింగ్ సంచలనం

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొన్ని రోజులకే ఫోన్ టాపింగ్ కేసు సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జీలు, సినీ ప్రముఖులు , జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా బిజినెస్ మ్యాన్‌ల ఫోన్లను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. ఇందులో భాగంగా తెలంగాణ SIB ప్రధాన కార్యాలయంలో ఉన్న CCTV కెమెరాలను ధ్వంసం చేసి కీలక రికార్డ్స్ తొలగించారు అప్పటి అధికారులు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు రాగానే SIB కార్యాలయంలోని ఫైల్స్ మొత్తాన్ని DSP ప్రణీత్ రావు ఆదేశాలతో తొలగించారు. SIB అడిషనల్ ఎస్పీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో పలువురు పోలీసు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. వీరి స్టేట్‌మెంట్ ఆధారంగా అప్పటి SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు, మీడియా సంస్థ ఛైర్మన్ శ్రవణ్ రావులను నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు విదేశాల్లో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఫోన్ టాపింగ్ కేస్ ప్రకంపనాలు సృష్టించింది. మే నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ ఫోన్ టాపింగ్ వ్యవహారం అత్యంత కీలకంగా మారింది.

ఫార్ములా ఈ కారు రేస్ కేసు

ఏడాది మొదట్లో కవిత అరెస్ట్…. చివరన ఫార్ములా ఈ కారు రేస్ కేసు… బీఆర్ఎస్ పార్టీకి వరెస్ట్ ఇయర్‌‌గా 2024 నిలిచిపోయిందనేందుకు ఉదాహరణలు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఏ నోట చూసినా ఫార్ములా ఈ కార్ రేసు కేసే. ఎప్పుడు కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారా అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కలవరం సృష్టించింది. 2023 ఫిబ్రవరి 9, 10 తేదీల్లో ఫార్ములా ఈ కార్ రేజ్ సీజన్ 9ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది. సీజన్ 9తో పాటు 10 ,11, 12కు సైతం ప్రమోటర్‌గా ace next gen సంస్థనే వ్యవరించి టోర్నమెంట్ నిర్వహించేందుకు కావలసిన అన్ని ఫీజులు ఖర్చులు మొత్తం చూసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ సంస్థ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు ముందుకు రాలేదు. దీంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీజన్ 10 ప్రమోటర్‌గా HMDA ఉండాలని నిర్ణయం తీసుకొని కేబినెట్ అనుమతి లేకుండానే 55 కోట్ల రూపాయలు చెల్లించారు. ఇప్పుడు ఈ 55 కోట్ల రూపాయలు ఎలాంటి అనుమతులు లేకుండా, కేబినెట్ అప్రూవల్ లేకుండానే ఒక విదేశీ సంస్థకు డబ్బులను పంపారు అనేది ప్రధాన అభియోగం. ఒకవైపు సీజన్ 10 హైదరాబాదులో జరగలేదు, మరోవైపు నిబంధనలు అతిక్రమించి విదేశీ సంస్థకు కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను పంపడంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్‌పై కేసు నమోదు చేసింది తెలంగాణ ఏసీబీ. ఈ కేసులో కేటీఆర్ అరెస్టు అవుతారన్న ప్రచారం జోరందుకుంది.

నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ వ్యాఖ్యలు

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర అలజడి సృష్టించాయి. కేటీఆర్‌ను విమర్శిస్తూ… నాగచైతన్య, సమంత విడాకులకి కేటీఆర్ కారణం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్‌కి నోటీసులు ఇచ్చింది. ఆ సమయంలో కేటీఆర్ వద్దకి సమంతను వెళ్లమని నాగార్జున చెబితే ఆమె వినలేదని…. అందుకే విడాకులు తీసుకుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రముఖులు కొండా సురేఖ మాటలను ఖండించారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేసిన మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున, కేటీఆర్‌లు విడివిడిగా పరువునష్టం దావా వేశారు. పిటిషన్ విచారణ సందర్భంగా నాగార్జున కుటుంబ సభ్యులతో హాజరు కాగా కేటీఆర్ తమ నేతలతో కోర్టు నేరుగా హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఈ ఇష్యూ కూడా సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగేందుకు కారణం అయింది. ఇక అల్లు అర్జున్ అరెస్టుతో అది తీవ్రస్థాయికి చేరింది.

భూదాన్‌ భూముల కేసు

భూ బదలాయింపుల కేసులో రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌‌కి ఈడీ ఉచ్చు బిగుస్తోంది. మహేశ్వరం భూదాన్ భూముల కేసుకు సంబంధించి నమోదైన కేసులో ఈడీ విచారణ జరుపుతుంది. ప్రస్తుత, మాజీ ఐఏఎస్‌లతోపాటు ఇతర అధికారులు, అప్పటి నాయకుల ప్రమేయంపైనా ఈడీకి ఫిర్యాదులు అందాయి. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసిన ఈడీ… భూదాన్‌ భూముల వ్యవహారంలో స్థానిక పోలీసులకు లేఖలు రాసినా ఏ వివరాలూ ఇవ్వలేదని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. శంకర్‌ హిల్స్‌ సొసైటీ, బాల సాయిబాబా ట్రస్ట్‌ భూములు, రాయదుర్గంలోని కొన్ని భూముల వ్యవహారంలో విచారణ జరిపించాలని ఈడీ అధికారాలు డీజీపీని కోరారు. అత్యంత విలువైన భూ బదలాయింపులకు సంబంధించి.. త్వరలోనే కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నట్లు కూడా కనిపిస్తోంది.

మంచు ఫ్యామిలీలో వివాదాలు

మంచు ఫ్యామిలీలో వివాదాలు ఈ ఏడాది హాట్ టాపిక్‌గా నిలిచాయి. పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంచు మనోజ్‌, మోహన్ బాబు ఫిర్యాదుతో ఫ్యామిలీ ఇష్యూ రచ్చకెక్కిది. జల్‌పల్లిలోని నివాసంలోకి రాకుండా బౌన్సర్లు అడ్డుకుంటే… గేట్ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లాడు మంచు మనోజ్. ఈ పరిణామాలతో ఇంటి నుంచి బయటకు వచ్చిన మోహన్ బాబు సంయమనం కోల్పోయి మీడియా ప్రతినిధిపై దాడి చేశాడు. దీంతో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయింది. మంచు ఫ్యామిలీ వివాదాలు రచ్చకెక్కడం, పోటాపోటీగా ఇరు వర్గాలు బౌన్సర్లను దింపి హల్‌చల్ చేస్తుండటంతో రాచకొండ సీపీ మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్‌లకు నోటీసులిచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా బాండ్ రాయించారు. హత్యాయత్నం కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయగా… హైకోర్టులో చుక్కెదురైంది. మంచు ఫ్యామిలీలో వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు

టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు కూడా ఈ సంవత్సరం సంచలనంగ మారింది. జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగికంగా దాడికి పాల్పడ్డాడని అసిస్టెంట్ కొరియో గ్రాఫర్ ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ 15న పోలీసులు జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 19న నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడానికంటే ముందు కేంద్రం ఆయనకు జాతీయ అవార్డ్ ప్రకటించింది. అతనిపై ఫోక్సొ చట్టం కింద కేసు నమోదు కావడంతో కేంద్రం జాతీయ అవార్డును రద్దు చేసింది. సుమారు నెలరోజుల పాటు చంచల్ గూడా జైల్లో ఉన్న జానీ మాస్టర్ అనంతరం రిలీజ్ అయ్యారు. తాజాగా జానీ మాస్టర్ కేసులో నార్సింగ్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్ధారిస్తూ నార్సింగ్ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం

ఈ సంవత్సరం హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. ప్రేమ పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ హీరో రాజ్ తరుణ్‌పై లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రిలేషన్ కొనసాగిస్తూ, తనను దూరం పెడుతున్న రాజ్ తరుణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. రాజ్ తరుణ్ కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. లావణ్య, మస్తాన్ సాయి అనే అబ్బాయితో రిలేషన్ కొనసాగిస్తుందని, ఇద్దరూ కలిసి డబ్బుకోసం నాటకం ఆడుతున్నారని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. ఇద్దరూ డ్రగ్స్ బానిసలని ఆరోపించారు. రాజ్ తరుణ్ లావణ్య వివాదం సుమారు మూడు నెలల పాటు డైలీ సీరియల్‌లా కొనసాగింది. ముంబైకి వెళ్లి తన భర్తను తనకు ఇచ్చేయాలని మాల్వి మల్హోత్రా నివాసంలో రచ్చ చేసింది.

మావోయిస్టు పార్టీకి భారీ నష్టం

ఈ ఏడాది మావోయిస్టు పార్టీకి భారీ నష్టం జరిగింది. తెలంగాణలో చాలా రోజుల తర్వాత భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రాద్రి-ములుగు జిల్లాల సరిహద్దుల్లోని గుండాల, కరికగూడెం మండలాల పరిధిలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో గ్రేహండ్స్ బలగాలు కూబింగ్ చేపట్టగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగాయి. ఈ కాల్పుల్లో లచ్చన్న దళానికి చెందిన ఆరుగురు మావోయిస్టులు హతమైనట్లు తెలిసింది. లచ్చన్న సహా ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. నారాయణ్‌పూర్‌- దంతేవాడ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో ప్రధానంగా ఆపరేషన్‌ ప్రహార్‌, ఆపరేషన్‌ కగార్‌లతో కేంద్ర బలగాలు దండకారణ్యంలో మావోయిస్టులపై విరుచుకుపడుతున్నాయి. 2024 జనవరి నుంచి జులై వరకే 171 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

సంచలనాలకు వేదికగా మారింది 2024. నూతన సంవత్సరం 2025లో సైతం ఈ కేసుల గోల వీడేలా లేదు. దర్యాప్తులు, అరెస్టులు తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

Latest Articles

మిస్టరీగానే మధ్యప్రదేశ్‌ గోల్డెన్‌ మిస్టరీ

దేశ చరిత్రలో ఇటీవల మధ్యప్రదేశ్‌ భోపాల్‌ కేంద్రంగా వెలుగుచూసిన అవినీతి కేసు అత్యంత సంచలనం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లిన ఓ ఎస్‌యూవీలో 52 కిలో గ్రాముల బంగారం , రూ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్