రాజకీయపార్టీల ఎలక్టోరల్ బాండ్ల వివరాలకు సంబంధించి గడువు పొడిగించాలన్న ఎస్ బీఐ పై సుప్రీంకోర్టులో కోర్టుధిక్కారణ పిటిషన్ దాఖలైంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ – ఏడీఆర్ – అనే స్వచ్ఛంద సంస్థ ఈ కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేసింది. ఏడీఆర్ సంస్థ తరుపున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను మార్చి 11న విచారిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం పేర్కొంది.
రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్న ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బహిర్గతం చేసేందుకు ఎస్ బీఐకి ఇచ్చిన గడువు మార్చ్ 6తో పూర్తయింది. గడువును జూన్ 30 వరకూ పొడిగించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేసింది. రాజకీయ పార్టీలు లెక్కా, పత్రం లేకుండా విరాళాలు సేకరించేందుకు 2018లో ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్లు పథకం రాజ్యాంగ విరుద్ధమని గతంలో సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా కొట్టివేసింది. ఎస్ బీఐ కోరినట్లు వివరాల వెల్లడి గడువు జూన్ 30 వరకూ పొడిగిస్తే.. లోక్ సభఎన్నికలు పూర్తయ్యే వరకూ రాజకీయ పార్టీలకు అందిన విరాళాల వివరాలు రహస్యంగానే ఉండిపోతాయి.


