తుక్కుగూడ సభా వేదికగా సౌతిండియా క్యాంపెయిన్‌కు సిద్ధమవుతోంది కాంగ్రెస్. గ్యారెంటీలను నమ్ముకుంటే దేశాన్నే ఏలేయవచ్చన్న గ్యారెంటీతో ఎన్నికల పోరుకు సై అంటోంది. అందుకే పాంచ్ న్యాయ్ పాచిక పని చేస్తోందన్న ధీమాలో ఉంది. ఇక 10 ఏళ్ల నిరీక్షణను పటా పంచలు చేస్తూ.. తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో తుక్కుగూడను సెంటిమెంట్‌గా భావిస్తోంది కాంగ్రెస్. దీంతో అక్కడి నుంచే లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించేందుకు రెడీ అవుతోంది.
కాంగ్రెస్‌కు కలిసివచ్చిన తుక్కుగూడ నుంచే లోక్‌సభ ఎన్నికల శంఖారావానికి సిద్దమవుతోంది హైకమాండ్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడ వేదిక ఆ పార్టీకి కలిసిరావడంతో 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత అధికార పగ్గాలు చేతపట్టింది. దీంతో ఆ ప్రాంతాన్ని సెంటిమెంట్‌గా భావిస్తున్న హస్తం పార్టీ.. ఇక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఏప్రిల్ మొదటి వారంలో జరిగే భారీ బహిరంస సభా వేదికగా లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు వర్షన్ ను ఇక్కడే రిలీజ్ చేయనుంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలంతా క్యూకట్టరానున్నారు. సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు పలువురు ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
మరోపక్క కాంగ్రెస్ పార్టీకి గ్యారెంటీ స్కీంలు కూడా బాగా కలిసివస్తున్నాయి. కర్ణాటకలో మొదలుపెట్టిన ఈ స్కీంలు అక్కడ విజయాన్ని అందించాయి. అదే ఫార్ములాతో తెలంగాణ ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల్లోనూ గ్యారెంటీల సెంటిమెంట్‌తో ముందుకు వెళ్తోంది. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల మాదిరే తుక్కుగూడ వేదికగా పాంచ్ న్యాయ్ పేరుతో తమ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనుంది కాంగ్రెస్. ఇక ఈ సభలో మేనిఫెస్టోతోపాటు సౌత్ ఇండియా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశాలన్నీ ప్రకటిస్తారు. సభలు, సమావేశాలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, రోడ్ షోల షెడ్యూలను కూడా విడుదల చేసే అవకాశముంది.
పార్లమెంట్ ఎన్నికల వేళ సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు భారీగా జనసమీకరణపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఈ మేరకు పది లక్షల మందితో సభను నిర్వహిస్తోంది. ప్రతి జిల్లా నుంచి 25 వేల మందికి తగ్గకుండా జనాన్ని తరలించాలని స్థానిక నేతలకు ఆదేశాలు కూడా వెళ్లాయి. ఈ బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులకు అప్పగించారు రాష్ట్ర నాయకత్వం. ఇప్పటికే సభ ఏర్పాట్లు, జన సమీకరణ, మెయింటెనెన్స్ తదితర కార్యక్రమాల కోసం కో– ఆర్డినేట్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేసింది. ఈ రెండు మూడు రోజుల్లోనే వీరితో గాంధీభవన్‌లో సమీక్ష నిర్వహించి సభా ఏర్పాట్లపై చర్చించనుంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గతేడాది సెప్టెంబరు 17న రంగారెడ్డి జిల్లా వేదికగా ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. సోనియాగాంధీ చేతుల మీదుగా ఈ హామీలను ప్రకటిస్తూ.. తాము అధికారంలోకి వస్తే పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువస్తామంటూ ఈ సభా వేదికగానే తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. అవి నమ్మిన జనం 10 ఏళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ సర్కార్‌ను గద్దె దించి కాంగ్రెస్‌కు పాలన పగ్గాలు అప్పజెప్పారు. దీంతో తుక్కుగూడను సెంటిమెంట్‌గా భావిస్తోంది అధిష్టానం. ఇక్కడ నుంచే లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూర్తిస్తే… కేసీఆర్ మాదిరే మోదీ సర్కార్‌కు చరమగీతం పాడి తాము అధికారంలోకి రావచ్చన్న వ్యూహంలో ఉంది.
మరి హస్తం నేతలు ఆశిస్తున్నట్టు తుక్కుగూడ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా…?, పాంచ్ న్యాయ్ మేనిఫెస్టో మోదీ సర్కార్‌ను కూలుస్తుందా..? గ్యారెంటీలను దేశ ప్రజలు నమ్ముతారా అన్నది తెలియాలంటే మాత్రం పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.