జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. 6 గ్యారంటీల అమలుపై బిఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. అయితే బడ్జెట్‌పై చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మేయర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్ ప్రదర్శించిన ప్లకార్డులను కాంగ్రెస్ కార్పొరేటర్లు చించివేశారు. రెండు పార్టీల కార్పొరేటర్ల మధ్య గొడవ జరగడంతో మార్షల్స్ వచ్చారు. బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు కార్పొరేటర్లను మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు
మేయర్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. మేయర్ విజయలక్ష్మి బడ్జెట్‌పై మాట్లాడాలని కోరారు. క్వశ్చన్ అవర్ కోసం బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. మేయర్ ప్రజా సమస్యలపై చర్చిద్దామని సర్దిచెప్పినా బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టువీడలేదు. ఈక్రమంలో ఆమె మార్షల్స్ తీసుకెళ్లిన కార్పొరేటర్లను తిరిగి సభలోకి తీసుకురావాలని పోలీసులను ఆదేశించారు. మరోవైపు ఆ నలుగురు కార్పొరేటర్లు లోనికి రావడానికి నిరాకరించడంతో వాగ్వాదం జరిగింది. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లందరినీ మేయర్ సస్పెండ్ చేశారు. వారిని మార్షల్స్ బయటికి పంపించగా జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.