రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలల పరిస్థితిపై సమీక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. కొమురం భీం జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ, ఆమె కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థులు ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించు కోకపోవడం దారుణమన్నారు. 11 నెలల్లలోనే 42 మంది విద్యార్థులు మృతి చెందడం బాధాకరమన్నారు. శైలజ పరిస్థితి విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.